పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్ని పద్యములను తానుగూడ కలిపి చదివెను. ఈలోపల సుబ్రహ్మణ్యము గతదినము విడిచిపెట్టిన భాగమును దీసి, అర్జునుఁడు ద్వారకానగరమునకు వెళ్ళిన భాగమునందలి_

      "ద్వాదశ మాసికవ్రతము ధర్మవిధిం జరపంగనేగి గం
       గాది మహానదీ హిమవదాది మహాగిరి దర్శనంబు మీ
      పాదపయోజదర్శనము పన్నుగఁజేయుటఁ జేసి పూర్వసం
      పాదితసర్వపాపములు వాసె భృశంబుగ నాకు నచ్యుతా!"

అను పద్యమును జదివెను, ఆప్పుడు శాస్త్రులు పద్యములో నున్నవి కొన్నియు లేనివి కొన్నియుఁ గల్పించి దీర్ఘములు తీయుచు నర్ధము చెప్ప మొదలుపెట్టెను. అర్థము చెప్పుచున్న కాలములో సుబ్రహ్మణ్యము పుస్తకముయొక్క సూత్రమునకుఁ గట్టి యున్న పడకను జేతిలోఁ బట్టుకొని త్రిప్పుచుండెను అదిచూచి శాస్త్రులు ఉలికిపడి ముక్కు మీఁద వ్రేలు వైచుకొని "పుస్తకము చదువుచుండగా దాని నాప్రకారము ముట్టుకోవచ్చునా? వ్యాసుల వారు దాని మీఁదఁ గూరుచుందు రే' యని దగ్గఱ నున్నవారి కావిషయ మయిన కథ నొకదానిని జెప్పెను. ఆ మాటమీఁద నందులో నెవ్వరో యడిగినదానికిఁ బ్రత్యుత్తరముగా, వ్యాసులవారు దగ్గఱనుండి వెళ్ళచుండినఁ గాని స్మరణకు రారనియు, వారప్పు డామార్గముననే యాకాశముమీఁద దివ్య విమానమెక్కి వెళ్ళుచున్నారనియు చెప్పి ఆకాశమువంకఁ జూచి కన్నులు మూసికొని మూఁడునమస్కారములు చేసెను. ఈ ప్రకారముగా సంజవేళకు ఆదిపర్వము ముగిసినందున నాటికిఁ బురాణకాలక్షేపమును జాలించి "స్వస్తిప్రజాభ్య" మొదలుగాఁ గల శ్లోకమును జదివి యెవరియిండ్లకు వారు వెళ్ళిపోయిరి.

రాజశేఖరుఁడుగారి యింటికి నిత్యమును బంధువులు నలువది తరములు గడచిపోయినను వంశవృక్షములు సహితము చూచుకో నక్కఱలేకయే తమబంధుత్వము జ్ఞాపకముంచుకొని రాజశేఖరుఁడు గారిమీఁది ప్రేమచేత నాతనిని చూచి యాదరించిపోవలెనను నుద్దేశముతో వచ్చి నెలల కొలఁదినుండి తినిపోవుచు వస్త్రములు మొదలగు