పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 రాజ__లోపల బల్లమీఁద ఆదిపర్వ మున్నది, తీసికొని వచ్చి శాస్త్రులు గారిని వెళ్లి పిలుచుకొని రా.

తండ్రి యాజ్ఞప్రకారము సుబ్రహ్మణ్యము లోపలికి వెళ్ళి పుస్తకమును దీసికొనివచ్చి తండ్రిచేతి కిచ్చి, నడవలో నుండి నడచి వీధిగుమ్మము మెట్లు దిగుచు, దూరమునుండి వచ్చుచున్న యొక నల్లని విగ్రహమునుజూచి" వేగిరము రండి" అని కేకవేసి, తాను మరలి వచ్చి శాస్త్రులుగారు వచ్చుచున్నారని చెప్పి చావడిలో నడుమగా పుస్తకమును ముందఱఁ బెట్టుకొని కూర్చుండెను. ఇంతలో శాస్త్రులును బుజముమీఁద చినిగిపోయిన ప్రాఁతశాలువను మడతపెట్టి వేసికొని, బంగారము ఱేకెత్తుటచే నడుమ నడుమ లోపలి లక్క కనఁబడుచున్న కుండలములజోడు చెవుల నల్లలనాడుచుండ వచ్చి సభలోఁ గూర్చుం డెను. రాజశేఖరుఁడుగారు సాహిత్యపరులయ్యును, ఆకాలమునందు పెద్ద పుస్తకమును జదివి మఱియొక పండితునిచే అర్థము చెప్పించుట గొప్ప గౌరవముగా నెంచఁబడుచుండును గనుక, ఆ శాస్త్రులు వచ్చువఱకును పుస్తకమును జదువక గనిపెట్టుకొని యుండిరి.

రాజ__మీ రీ వేళ నింతయాలస్యముగా వచ్చినా రేమండి?

శాస్త్రి__ఇంతకుమును పొకపర్యాయమువచ్చి చూచి పోయి నాను. తమరు లేవలేదని చెప్పినందున వేఱే యొక పెద్ద మనుష్యునితోఁ గొంచెము మాటాడవలసిన పనియుండఁగా మీరు లేచునప్పటికి మరల వత్తమని వెళ్ళినాను. ఆయనతో మాటాడుట కొంచె మాలస్య మయినది. క్షమించవలెను-నాయనా, సుబ్రహ్మణ్యమూ! పుస్తకము విప్పు.

సుబ్రహ్మణ్యము పుస్తస్తకమును విప్పుచు, 'తుండము నేక దంతమును దోరపుబొజ్జయు' నను విఘ్నేశ్వర స్తవ పద్యము నారంభించి చదువుచుండఁగా శాస్త్రులందుకొని యా పద్యము కడ వఱకు నయిన తరువాత, "అంజలిఁజేసి మొక్కెద మదంబకు" మొదలుగాఁగల సరస్వతీ ప్రార్ధనమును, పిమ్మట 'ప్రాంశుయోద నీలతను భాసితు" మొదలుగా గల వ్యాస స్తోత్రమును, పిదప మఱి