Jump to content

పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానిని బహుమానములు వడయుచుందురు. ఊరనుండు పెద్దమనుష్యులును పరిచితులయిన వారును గూడ రాజశేఖరుడి గారి యింట వంట దివ్యముగా జేయుదురని శ్లాఘించుచు నెలకు సగముదినము లచ్చటనే భోజనములు చేయుచుందురు; వారుచేయు స్తోత్రపాఠముల కుబ్బి రాజశేఖరుఁడుగారును వారు వచ్చినప్పడెల్ల పిండివంటలును క్షీరాన్నమును మొదలగు వానిని చేయించి వారిచేత మెప్పు వడయఁ జూచుచుందురు. అన్న ముడుకకపోయినను, పులుసు కాగకపోయినను, పప్పు వేగకపోయిననుకూడ వారివంట బాగుండ లేదని యెవ్వరును జెప్పలేదు__ఊరకే వచ్చిన పదార్థమునం దెప్పుడును రుచి యధికముగా నుండునుగదా? కొందఱు బంధువులు తాము వెళ్ళునప్పడు కొంత సౌమ్మును బదులుపుచ్చుకొని అదివఱకుఁ దఱుచుగా వచ్చుచుఁ బోవుచు నుండువారేమైనను అంతటినుండి తీఱిక లేక బదులుతీర్చుటకయి మరల నెప్పుడును వచ్చెడివారు కారు. ధన వంతుఁడు గనుక ఆయన కెల్లవారును మిత్రులుగా నుండిరి__ఆ మిత్రసహస్రములలో నొకఁడైనను నిజమైన యాప్తుఁ డున్నాడో లేఁడో యన్నసంగతిని మాత్రమాయనకు ధనలక్ష్మి తెలియనిచ్చినది కాదు. ఆట్టి మిత్రోత్తము లందఱును రాజశేఖరుఁడుగారికి స్తుతి పాఠములతో భూమిమీదనే స్వర్గసుఖమును గలిగించి యాయన నానందింపఁ జేయుచుఁ దా మాయన యిచ్చెడి ధనకనక వస్తువాహనముల నాతని ప్రీతికై యంగీకరించుచుందురు. నిత్యమును యాచకు లసంఖ్యముగా వచ్చి తమ కష్టకథలను గాధలుగాఁ జెప్పి చివరకు దమ కేమయినను యిమ్మని తేల్చుచుందురు - అట్టివారు నటించెడి యాపద నన్నిటిని ఆతఁడు నిజమయిన వానినిగానే భావించి సాహాయ్యము చేయుచుండును. కొందఱు బ్రాహ్మణులు పిల్లవానికి వివాహము చేసికొనెద మనియు, ఉపనయనము చేసికొనెద మనియు, తాము యజ్ఞములు చేసెదమనియు, సత్రములు సమారాధనలు చేయించెద మనియు చెప్పి యాయనవద్ద ధనమార్జించుకొని పోవు చుందురు. మిత్రుల వేడుకకయి రాజశేఖరుఁడుగారియింట రాత్రులు