తఱచుగా గానవినోదములను నాట్యవిశేషములను జారిపోతాది నాటక గోష్టులను జరుగుచుండును. మోసగాండ్రు కొందఱు తమ కమ్ముడుపోని యుంగరములు మొదలగు వస్తువులను దెచ్చి, వానిలోఁ జెక్కినరాళ్ళు వెలయెఱిగి కొనఁగలిగిన సరసులు రాజశేఖరుడుగారు తప్ప మఱియొకరు లేరని ముఖప్రీతిగా మాటలు చెప్పి వస్తువు అంత వెల చేయకపోయినను మాటలనే యెక్కువ వెలకు విక్రయించి పోవు చుందురు. గ్రామములోని వైదిక బృందము యొక్క ప్రేరణచేత సప్త సంతానములలో నొకటైన దేవాలయనిర్మాణము జేయ నిశ్చ యించుకొని, రాజవరపు కొండనుండి నల్లరాళ్లు తెప్పించి రాజశేఖ రుఁడుగారు రామపాదక్షేత్రమునకు సమీపమున నాంజనేయునకు గుడి కట్టింప నారంభించి నాలుగు సంవత్సరములనుండి పనిచేయుచుండెను. కాని పని సగముకంటె నెక్కువ కాకపోయినను పనివాండ్రును పని చేయింపఁ దిరుగుచుండెడి యాశ్రితులను మాత్రము కొంతవఱకు భాగ్యవంతు లయిరి. ఈ ప్రకారముగాఁ దన్ననాదరము చేసి యితరులపాలు చేయుచు వచ్చుచున్నందున, ధనదేవత కాతవియం డాగ్ర హమువచ్చి లేచిపోవుటకు బ్రయత్నము చేయుచుండెను గాని చిర పరిచయమునుబట్టి యొక్కసారిగా విడువలేక సంకోచించుచుండెను. ఈ సంగతిని దెలిసికొని దారిద్ర్యదేవత యప్పుడప్పుడువచ్చి వెలుపల నుండియే తొంగిచూచుచు, భాగ్యదేవత యాతనిగృహము చోటు చేసినతోడనే తాను బ్రవేశింపవలెనని చూచుచుండెను. రుక్మిణి వివాహములో నిచ్చిన సంభావన నిమిత్తమై రాజశేఖరుడుగారికి మాన్యములమీఁదఁ గొంత ఋణమైనందున దానిమీద వడ్డి పెరుగు చుండెనేకాని మఱియొకతొందర యేమియును గలుగుచుండలేదు.
రాజశేఖరుడుగారివలన బాగుపడినవారు పలువురున్నను వారిలోనెల్ల దామోదరయ్యయు, నారాయణమూర్తియు ముఖ్యులు, ఆ యిద్దరిలో దామోదరయ్య రాజశేఖరుఁడుగారి బావమఱఁది; రాజశేఖ రుఁడుగారి తోడఁబుట్టిన పడుచునే యాతనికిచ్చిరి కాని యామె ఒక్కకుమారుని మాత్రము గని కాలముచేసెను. ఆ కుమారున కిప్పుడు