పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొడుచుచున్నట్టు నడుమనడుమ చిలుకలు చిత్రింపబడి యున్నవి. వీధి తలుపులకు బలమయిన గ్రంధులు చేయఁబడి వాని పయిని సహిత మొకవిధమైన పుష్పలత మలఁచఁబడి యున్నది.

గుమ్మము దాటి లోపలికి వెళ్ళినతోడనే చావడి యుండెను. ఆ చావడి కెదురుగా పెద్ద కుండు ఒకటి యుండెను. వర్షము కురియు నప్పుడు నాలుగు వైపులనుండియు చూరునీళ్ళా కుండులోఁబడి వీధి చావడి క్రింద నుండు తూముగుండ వీధిలోనికిఁ బోవును. ఆ కుండు కుత్తరపవైపుననుదక్షిణపువైపునను ఒకదానికొకటి యెదురుగా రెండు చావళ్ళుండును. అందు దక్షిణపుది కచేరిచావడి. దానిలో వివాహాదుల యందు తాంబూలములకు పిలిచిన బంధువులను పెద్దమనుష్యులను సభ చేసి గూర్చుండఁగా, క్రింద బోగము మేళము జరుగుచుండును. ఇతర సమయములలో పెద్దమనుష్యులు చూడవచ్చినప్పడును, మధ్యాహ్నభోజన మయిన తరువాత పురాణ కాలక్షేపము జరుగునప్పుడును, శిష్యు లప్పుడప్పుడు చదువుకో వచ్చినప్పుడును రాజశేఖరుఁ డుగా రందు కూర్చుందురు. ఆ చావడికి రెండు ప్రక్కలను రెండు గదులు గలవు. ఆ చావడి దక్షిణపువైపు గోడకు పొడుగునను ఱెక్కల తలుపు లుండి, తీసినప్ప డెల్లను సభవారి చెమటలార్ప మలయ మారుతమును లోపలికిఁ బంపుచుండును. ఆ తలుపులకు వెనుక పంచ పాళియు, దాని వెనుక పలువిధములయిన పూలమొక్కలతో నేత్రము లకు విందుగొలుపు చిన్న దొడ్డి యుండెను. ఆ చావిడిలో మూడు గోడలకును నిలువెడెత్తునకు పయిని మేకులకు గొప్ప పటములు వేయఁబడియున్నవి. అందు దశావతారములు మాత్రమే కాక, కృష్ణుడు గోపికల వలువలు నెత్తికొనివచ్చి పొన్నచెట్టుమీఁదఁ గూర్చుండి వారిచేఁ జేతులెత్తి మ్రెుక్కించుకొనుచున్నట్టును, వెన్నలు దొంగిలినందుకయి తల్లి రోటను గట్టిపెట్ట దాని నీడ్చుకొనిపోయి మద్దులఁ గూ ద్రోచినట్టును, మరియు ననేకవిధముల కృష్ణలీలలు గల పటములును, కుమారస్వామి తారకాసురుని జంపుచున్నట్టును, పార్వతి మహిషాసురుని వధించుచున్నట్టును, శివుఁడు త్రిపురసంహా

40