పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెద్దలుగాని యెప్పడును యజ్ఞము చేసినవారు కాకపోయినను, సోమి దేవమ్మ పుట్టినింటివంక వారిలో మాత్రము యజ్ఞము చేపినవారు బొత్తిగా లేకపోలేదు. సాక్షాత్తుగా ఆమె పితామహుఁడే యజ్ఞముచేసి యేటేట నొక్కొక్కటి చొప్పున మూడుపదుల మీఁద నాలుగు శ్రావణపశువులను బట్టి మఱి రంభాదులతో స్వర్గసుఖ మనుభవింపఁ బోయెను. సోమిదేవమ్మ తండ్రి యజ్ఞము చేయకపోయినను, తండ్రి యెంతో ధనవ్యయము చేసి సంపాదించుకొన్న పేళ్ళను మాత్రము పోగొట్ట నిష్టములేనివాఁడయి తన కుమారునకు సోమయాజులనియు, కుమార్తెకు సోమిదేవమ్మ యనియు నామకరణములు చేసెను.

రుక్మిణియు సందులో నూఱు బారలు నడచి, అక్కడ నుండి దక్షిణముగా తిరిగి, ఆ సందులో రెండు గుమ్మములు దాఁటి పెరటి దారిని మూడవయిల్లు ప్రవేశించెను.

రాజశేఖరుఁడుగారి యిల్లు ఆకాలపుటిండ్లలో మిక్కిలి సుందర మైనది. వీధి గుమ్మమునకు రెండు ప్రక్కలను రెండు గొప్ప అరుగులు కలవు. ఆ రెండు ఆరుగులకును మధ్యను పల్లముగా లోపలికిఁ బోవ నడవ యున్నది. ఆ నడవ మొగమున సింహద్వార మున్నది. ద్వారబంధపు పట్టెలకు గడపదాపున ఏనుఁగుతలమీద సింహము గూర్చుండి కుంభ స్థలములను బద్దలు చేయుచున్నట్లు చిత్రముగా చెక్కబడి యున్నది. ఇరుప్రక్కలనుండు నాసింహములయొక్క శిరో భాగములు మొదలుకుని గొడుగుబల్లవఱకును పువ్వులను కాయలను గల లత చెక్కఁబడియున్నది. ఈ కమ్ములకు పయిగా రెండు ప్రక్కలను కఱ్ఱ గుఱ్ఱములు వీధి వైపునకు ముందఱి కాళ్ళు చాచి చూచు వారిమీఁద దుముకవచ్చునట్లుగాఁ గానిపించును. ఈ గుఱ్ఱముల కాళ్ళకే శుభదినములందు మామిడాకుల తోరణములు గట్టుచుందురు. గుఱ్ఱముల రెంటికిని నడుమ నుండు గొడుగుబల్లమీఁద నడుమను పద్మ మును, పద్మముల కిరు పార్శ్వములను గుఱ్ఱములవఱకు చిత్రము లయిన యాకులను, పువ్వులనుగల తీఁగెయును చెక్కఁబడి యున్నవి. ఆ తీగపైని కాళ్ళు మోపి ఫలములను ముక్కుతో

39