పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలిగినంత పెద్దపట్టును పట్టి బుఱ్ఱున పీల్చి రెండుముక్కులలోను ఎక్కించి, మిగిలిన దానిని రెండవపట్టు పట్టి చేతిలో నుంచుకొని, ఎడమచేతిని కట్టుకున్న బట్టకు రాచి ముక్కు నలుపుకొని, "శుభే శోభన ముహూర్తే -శ్రీ మహావిష్ణురాజ్ఞేయ - ప్రవర్తమానస్య-ఆద్య బ్రహ్మణ- ద్వితీయ ప్రహరార్ధె. శ్వేతవరాహ కల్పే - వైవస్వతమన్వం తరే. కలియుగే. ప్రథమపాదే. జంబూద్వీపే భరతవర్ష . భరతఖండే. అస్మిన్ - వర్తమానే - వ్యావహారిక చాంద్ర మానేన - కాళయు క్తి నామసంవత్సరే - దక్షిణాయనే. శరదృతౌ. కార్తీకమాసే. కృష్ణపక్షేద్వాదశ్యాం. ఇందువాసరే. శుభనక్షత్ర - శుభయోగ. శుభకరణాద్యనేక గుణ విశిష్టాయా - మాస్యాం - శుభతిధౌ - క్షేమస్థైర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం - అఖండ గౌతమీస్నాన మహం కరిష్యే-మూడు మాఱులు స్నానము చేయండి.

రుక్మిణి తఱుచుగా స్నానము చేయునది కాదుగాన లోతునీళ్ళ లోనికి వెళ్ళటకు భయపడి, మునుఁగుటకు చేతఁగాక మోకాలిలోఁతు నీళ్ళలోఁ గూర్చుండి కొప్పువిప్పుకొని దోసిలితో తలమీఁద నీళ్ళుపోసి కొనుచుండెను. అప్పడు సంకల్పము చెప్పిన బ్రాహ్మణుఁడు డబ్బు నిమి త్తము తరువాత వచ్చెదనని చెప్పి వెడలిపోయెను. అంతట రుక్మిణి బట్టకొంగుతో తలతుడుచుకొని,శిరోజములు చివర ముడివైచి కొని గట్టువంకఁ జూచి దూరమునుండి వచ్చుచున్న తండ్రిగారిని జూచి వేగిరము వేగిరము బయలుదేరి, రాతిమీఁద బెట్టిన కుంకుమ పొట్లమును దీసి నొసట బొట్టుపెట్టుకొని, రెండుమాఱులు చేతితో నీళ్ళ చెంబుమీఁద పోసి తీసికొని, రెండడుగులు నదిలోనికిఁ బోయి నీళ్ళు ముంచుకొని, బట్ట తిన్నగా సవరించుకొని, ఉతికిన బట్టలు బుజము మీఁదను వానిపయిని నీళ్ళతో నున్న బిందెయును పెట్టుకొని తనకొఱకయి కనిపెట్టుకొని యున్న సిద్ధాంతిగారి భార్యతోఁ గూడ గృహమునకుఁ బోవ బయలుదేఱెను.



37