పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునకంటె నధికమైన ధనము దానము చేయకుండవలయును. ఒక్కకుటుంబములోని వారు పలువురు పదిమందితో నత్యంతమైత్రి కలిగియే యున్నను గృహము చేరినతోడనే గర్భశత్రువులుగా నుందురు. కాబట్టి మీ కుటుంబమునం దట్టి కొఱఁత కలుగకుండఁ గాపాడుచు రావలయును, విరోధమును సాధించుటకు మంచి యుపాయము శాంతిని వహించుటయే. మనకెవ్వరిమీఁద నైనను పగ తీర్చుకోవలెనని బుద్దిపుట్టి దానిని మరలించుకో లేనియెడల మనము పగతీర్చుకోశ క్తి కలిగి యుండియు క్షమింతుమేని, శత్రువులు సహితము మనలను జూచి బుద్ధి తెచ్చుకొని జ్ఞానవంతులగుదురు. కప్ప కఱవ వలెనని ప్రయత్నము చేసిన నెంత ప్రయోజనకారి యగునో బీదవాఁడు గొప్పవానిని పగసాధింపఁ దలఁపుగొన్న నంత ప్రయోజనకారిగానే యుండును. వట్టి బెదరింపులతోనే ముగిసెడు కోపము నెవరు లక్ష్యము చేయుదురు? అట్టి కోపమువలన మనకార్యమును సాధించుకోలేకపోవుట యటుండఁగా మీఁదు మిక్కిలి నష్టమును కూడఁ బొందుదుము. మీరు శోభనాద్రి రాజు మీఁద తొందర పడి మీ కోపమును చూసినందున నేకదా మీకు కారాగృహబంధనము సంభవించినది: కాబట్టి యిఁక ముందెప్పుడును మీరు మీకంటె నధికులైన వారి మీఁద మీ కోపమును కనబఱుప కుండవలయును. కొందఱు మతిహీనులు పూర్వకాలమే మంచిదని పొగడి మీరుచేయు దోషములను కాలమునందారోపించి మిమ్ము నిరుత్సాహలను జేయుదురు; కాని చక్కగా నాలోచించి చూడఁగా బూర్వకాలమునకంటె నిప్పటికాలమే మంచిదని నాకు తోఁచుచున్నది. పుణ్యపాపములు మనుష్యుల ప్రవర్తనములో నున్నవికాని కాలములో నేమియు లేవు. కాబట్టి మీరు చేసినదోషములకు కాలమును దూషింపక మీ ప్రవర్తనమును తిన్నపఱచుకొనుటకే ప్రయత్నపడవలయును. మీకు గౌరవముతో జీవనము జరుగుటకు చాలినంత సొమ్మున్నచో విశేషముగా లేదని మీరెప్పుడును చింత పడకుండవలయును. ఈరీతిని దెలిపెడి పూర్వకథ నొకదానిని మీకుఁ జెప్పెదను వినుండి పూర్వమొక ధనవంతుఁడు శరీరమునిండ రత్న ఖచితములైన స్వర్ణాభరణములను