పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధరించుకొని వీధినిబడిపోవుచుండగా, బీదవాఁడొకఁ డాతనినిని వెంబడించి నగలను జూచి మాటిమాటికి నమస్కరింప నారంభించెను. ఆ ధనికుఁడాతనిని జూచి 'నా నగలలో నేనేదియు నీకియ్యలేదే, ఎందుల కట్లు చేయుచున్నా'వని యడిగెను. 'ఆ నగలు నాకక్కఱలేదు; మీరు నన్ను నగలను చూడనిచ్చినారు గనుక నమస్కారములు చేసినాను; మీరును చూచుకొని సంతోషించుటయే కాని నగలవలన వేఱొక ప్రయోజనమును పొందఁజాలరు; మీరు నగలను కాపాడుకొనుటకై యెంతయు శ్రమపడుచున్నారు; నా కాశ్రమ యక్కఱలేకయే సంతో షము లభించు చున్నది: మీకును నాకు గల వ్యత్యాస మిదియే' యని వాఁడు బదులుచెప్పి పోయెను. ఈ హేతువునుబట్టియే నేను మీకు విశేషధనము నియ్యఁగలవాఁడ నయ్యును, ఇయ్యక మీ మాన్యములను మాత్రము విడిపించి యిచ్చుచున్నాను. వానితో మీరు తృప్తి పొంది సుఖజీవనము చేయుచుండుఁడు."

అని చెప్పి కృష్ణజగపతిమహారాజుగారు మీకు మఱి యేదియైనఁ గోరిక కలదాయని రాజశేఖరుఁడుగారి నడిగిరి. ఆయన ప్రభువువారి సుగుణసంపత్తిని వేయువిధముల గొనియాడి, తన కుటుంబమునకుం జేసిన మహోపకారమును స్మరించి తాను చెఱసాలలో నున్నకాలములో విజ్ఞాపనపత్రికను వ్రాసి పంపుట మొదలగు పనులలోఁ దన కత్యంత సహాయుఁడుగా నున్న మంచిరాజు పాపయ్యను చెఱనుండి విడిపింపుఁడని వేడుకొనెను. తన కపకారముచేసిన శత్రువునందు కూడ దయ గలిగియుండుటను శ్లాఘించి, రాజుగా రప్పుడే యాతనిని విడిచిపెట్ట నాజ్ఞాపత్రికను బంపి తాము కొలువు చాలించి యంతఃపుర మునకు విజయంచేసిరి, అంత రాజశేఖరుఁడుగారు మొదలగువారు కొలువుకూటమును విడిచి తమతమ యిండ్లకుఁ బోయిరి.