పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాగుననే యెల్లవారును నాకును కానుకలను సమర్పించి యాబొమ్మ రాతిని మూఁకలుగా వచ్చి జనులు చూచి పోవుచుండిరి; చూచిన తరువాత చేతకాని పనివానిచేతఁ జెక్కఁబడిన యా కురూపముగల విగ్రహములందువలెనే యారాతియందును వీధిలోఁ గనఁబడెడి బొమ్మరాయియే యని యెల్లవారికిని ననాదరము కలుగనారంభిం చెను. నిజముగా నేను సీతారామ యంత్రమని లోపలఁబెట్టి చూపిన శిలను ఒక దినమున వీధిలోఁ బెట్టి చూపినచో మఱునాఁడెవ్వరును దాని మొగము వంకనైనఁ జూడఁగోరరు. నేనా ప్రకారముగా యోగినిగా నున్నకాలములో ప్రయోగ విద్యయందును భూతవైద్యము నందును మిక్కిలి ప్రసిద్ధి కెక్కిన వాఁడను, కాబట్టి నా మహత్వము నెల్లవారును చెప్పుకొను చుందురు. నేను వదలింపఁబూను కొన్న దయ్యముల కథలనుబోలె నా కథలను సహిత మెల్లవారును నత్యాదరులై వినుచు వచ్చిరి; కాని యివియు వానివలెనే వినువారి భయమును మఱింతవృద్ధి పఱచుటకే వినియోగపడుచు వచ్చినందున, గ్రామములో నందఱును నేనేమి ప్రయోగము చేసిపోదు నేమో యని నాకు జడియు చుండిరి.

పయిమిషచేత ధన మార్జించి యా గ్రామములో సుఖజీవనము జేయుచుండఁగా నన్ను వ్యాధి యాశ్రయించినందున, నే నదివర కెందఱకో మరణమున బ్రహ్మైక్యమే కాబట్టి సంతోషింపవలయునని బోధించుచు వచ్చినను చచ్చిపోదునని భయపడఁ జొచ్చితిని. మీరే యోగిని బిలిచి మీకు మరణమన్న భయమేమైనఁ గలదా యని యడిగి నను తడవుకోకుండ లేదని చెప్పునుగాని యాతనికిఁ గొంచెము రోగమువచ్చి నప్పడు మాత్ర మాతని చర్యవలన మూఢులకుండు దానికంటె నెక్కువ భయము కలిగి యుండుటను గనిపెట్టవచ్చును. నేనట్లు యోగివేషము వేసికొనియున్న కాలమున నితరు లేయోగిని ప్రశంసించినను, నే నాతఁ డెంతవాఁడని తృణీకరింపుచుందును, సాధారణముగా యోగ్యులు తాము కీర్తిని బొందవలెనని కోరుచుం డఁగా అయోగ్యులు వారి కీర్తిని పాడుచేసి తమ కీర్తితో సమాన