పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 భీమ__చేయు దీపము దగ్గఱగాఁ బెట్టి దానికేపి రెప్పవాల్చక చూడు; నీకిప్పు డేమయినఁ గనఁబడుచున్నదా?

సామి__లేదు. కాటుక మాత్రము కనబడుచున్నది.

భీమ__చూపు చెదరనీయకు. ఇప్ప డేమయినఁ గనఁబడు చున్నదా?

సామి__కనఁబడుచున్నది. పెద్ద బంగారపురేకువలె నున్నది.

భీమ__ఆ రేకులనడుమ నేమయిన నున్నదా?

సామి__అవిసి చెట్టున్నది.

భీమ__అవిసిచెట్టుకా దశోకవృక్షము. ఆ చెట్టుకొమ్మలలో నెవ రున్నారో చూడు.

సామి__పెద్ద కోఁతియున్నది.

భీమ__కోఁతి యనఁబోకు, ఆంజనేయులవారను. నీ మనసులో నమస్కారముచేసి యేమిచెప్పునో తెలిసికో,

సామి__ఏమో పెదవులు కదల్చుచున్నాఁడు. ఆ మాటలు నాకుఁ దెలియవు.

భీమ__రాజుగారిసొమ్మెవ్వ రెత్తుకొని పోయినారో యడుగు.

సామి__రాజుగారివద్ద కొలువున్నవారిలోనే యొకరు తీసినారనుచున్నాఁడు.

భీమ__వారియింటిపే రడుగు.

సామి__గోటివారు.

భీమ__పేరుకూడ చెప్పమను.

సామి__సుబ్బమ్మ.

భీమ__సుబ్రహ్మణ్యమా? గోటేటి సుబ్రహ్మణ్యము.

సామి__ఇందాక వీ నాలాగునఁ జెప్పలేదు.