పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నంతను జెప్పుకొనిరి. అందుమీఁద నాతఁడుచేయవలసినపని యేమియు తోచక కాంతసే పాలోచించి, దొంగలను పట్టుకొని పోయినసొమ్ము తెప్పింపలేక పోయినయెడల రాజుగారి వలన మాటవచ్చును కాబట్టి రాజకీయ నియోగులలో నొకరిమీఁద పెట్టనిశ్చయించి, వారినందఱిని వేఱువేఱ పేర్కొని యెవరిమీఁదబెట్టిన నెవరికి కోపము వచ్చునోయని జడిసి, వారిలో లోకువ యైనవారిమీదికి త్రోయనెంచి, యావని తాను చేయుట యుచితముకా దని యింటికిపోయి మాటాడి యంజనము వేయువాని నొకనిని పిలుచుకొని జాములోపల మరల వచ్చెను.

నాయ__ఏమోయి భీమన్నా! రాత్రి రాజుగారియంట ధనము పోయినది. నీ వా ధనమపహరించినవానిని చెప్పఁగలిగిన యెడల, నీకు గొప్ప బహుమతి దొరకఁగలదు.

భీమ_-అదెంతసేపు? సొమ్ము తెప్పించుకోగలిగిన యెడల, అంజనము వేసి నిమిషములో పేరు చెప్పించెదను.

నాయ__అంజనమిప్పుడు నీ యొద్ద సిద్దముగా నున్నదా?

భీమ__ఉన్నది. అది పిల్లి కన్నులవానికేగాని పాఱదు, అటు వంటి వాని నెవ్వని నైనను పిలిపించవలెను.

నాయకుఁ డామాటలు విని యొకభటుని బిలిచి, 'నీవుపోయి చాకలి సామిగానిని తీసుకొనిరా, వానివి పిల్లికన్నులు" అని నియ మించెను. వాఁడు వెంటనేపోయి రెండు గడియలసేపునకు సామి గానిని వెంటఁబెట్టుకొని వచ్చెను. ఈలోపల నంజనము వేయువాఁడు దాసిదానిచేత గది నొకదాని నలికించి, అందొక మూలను నూనెతో గొప్ప దీపమును వెలిఁగించి తాను స్నానముచేసి వచ్చి దీపము ముందట పిండి మ్రుగ్గుతో నొకపట్టుపెట్టి అందాంజనేయవిగ్రహమును కాటుక కరాటమును ఉంచి పూజ చేయుచుండెను. చాకలివాఁడు వచ్చినతోడనే యాతఁడు తనపూజను చాలించి, పట్టులో వానిని గూరుచుండఁబెట్టి బరిణలోని కాటుకను వాని కుడిచేతిలో రాచి దానిని నిదానించిచూచి దానిలో నేమికనఁబడునో దానినెల్ల తనకుఁ జెప్పు చుండుమని యుత్తరువుచేసెను.