పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 భీమ__నీ వాంజనేయులవారితోనా మాటాడుచున్నావు. ఆంజ నేయు లిందాక నాలాగునఁ జెప్పలేదనుచున్నావా? ఆయన యాలాగు ననే చెప్పినాఁడు. నీవే పేరు నోటఁ బట్టలేక తప్పుపలికినావు. చాలు యీపాటికిలే, ఇంక మాటాడకు.

అని యాతడు సామిగానిని తనవెనుకకుఁ దీసికొని, సొమ్ము దీసినవాని పేరు బయలఁబడ్డదని కేకలు వేసి చెప్పనారంభించెను. భటుల నాయకుఁడును 'ఈ దొంగతనము మఱియొకరివలన జరిగినది కాదని యీ ప్రక్కచుండి యా ప్రక్కకుఁ దిరుగసాగెను. సభలోని యుద్యోగస్థు లందఱును వీం డ్రిద్దఱును గలిసి యా మాట చాకలి వానికి నేర్పి పెట్టిరికాని యిందు సత్యమేమియు లేదని తలచిరి. సాధారణ జను లందఱును నిజముగా దొంగతన మాతఁడు చేయక పోయినయెడల చాకలివాని కాపేరెట్లు తెలిసినదనియు, గట్టిగా సుబ్రహ్మణ్యము యాపని చేసెననియుఁ జెప్పుకొనుచుండిరి. ఊరనెక్కడఁజూచినను సుబ్రహ్మణ్యము సొమ్మును తస్కరించినట్టు అంజనము వేయఁగా బయలఁబడ్డ దని మూఁకలు గట్టి మాటాడుకొనఁజొచ్చిరి; రాజుగా రామాటల నెంతమాత్రము విశ్వసించలేదు.

అప్పుడు సభామందిరమునుండి యింటికిఁ బోవునపుడు త్రోవ పొడుగునను ప్రజలెల్ల "ఈతఁడే కన్నము వేయించినవాఁడు" అని సుబ్రహ్మణ్యమును వ్రేలుపెట్టి చూపనారంభించిరి. అందుచేతనాతఁడు వట్టి నిరాపనింద వచ్చెగదాయని సిగ్గుపడి రాత్రిభోజన మయినతరువాత నొక్కఁడును బరుండి తనలో దానిట్లు చింతింప మొదలుపెట్టెను; 'ఆ గోడకు కన్నము చేసినవాఁడెవ్వఁడయి యుండును? ఒకఁడంత సాహసపుబనిని చేయజాలడు. అటువంటి బలమయిన రాతిగోడకు కన్నము వేసినవారిద్దఱు ముగ్గురుండక తప్పదు. ఆ ముగ్గుఱు నెవ్వరై యుందురు? కోట సంగతి గుర్తెఱిగినవారే కాని మఱియొకరుకారు. నాలుగుదినముల క్రిందట నీలాద్రిరాజు నాచేతకోటపటమును వ్రాయించు కొన్న ప్పుడు ధనాగారమును గూర్చి రెండుమూడు సారులడిగెను.