పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెచ్చినవాఁడు రామరాజే కాని మఱియొకఁడు కాఁడని దృఢపఱుచు కొనిరి.

రాజ__రామరాజు మనవలన నుపకారమును పొందినవాఁడే? యిట్లేల చేసెనో !

మాణి__నాటిరాత్రి మన యందరి ప్రాణములను గాపాడి మనకెంతో ప్రత్యుపకారమును చూపినాఁడు. ఆతఁడీ యపకారము తలఁచుకొనుటకు నా కేమియు కారణము నూహించుటకు తోచ కున్నది.

రాజ__మన శత్రువులవద్ద ధనము పుచ్చుకొని యీ దుర్మార్గ మున కొడికట్టియుండవచ్చును. సొమ్ము ప్రాణమువంటి మిత్రులనయి నను పగవారినిగాఁ జేయునుగదా!

మాణి__నేఁటి కాలమునకు ధనాశ యాతని కీదుర్బుద్ధిని పుట్టించెను గాఁబోలును. అదిగో రామరాజును వచ్చుచున్నాడు. ఆతని నడిగిన సమ స్త్రమును తేటపడును.

రాజ__ఏమయ్యా, రామరాజుగారూ! మా వలన మహోపకార మును పొందియు మా కార్యవిఘాతము చేయుటకు మీకు ధర్మమా?

రామ__మీకు నేనేమి కార్యవిఘాతము చేసినాను?

రాజ__రామమూర్తి పోయినట్టు జాబు సృష్టించి నేనింట లేనప్పడు మావాండ్ర కిచ్చిపోలేదా?

రామ__నేను మీ యింటి మొగమయనను చూడలేదు. ఇటు వంటి లేనిదోషముల నామీద నారోపించిన, మీకును నాకును తిన్నగా జరగదు సుమండీ!

రాజ__మీరు మా ఇంటి మొగమే యెఱుఁగనియెడల, మీ చేతి కఱ్ఱ యిది యిక్కడకేలాగు వచ్చినది?

రామ__అయిదాఱు దినములనుండి నా చేతికఱ్ఱను గానక దాని నిమిత్తమై సకల ప్రయత్నములను జేయుచున్నాను. సరిసరి తెలిసినది. మీరా కఱ్ఱ యెత్తుకొనివచ్చి దానిని తప్పించుకొనుటకయి ఎదురు నాఁమీదను దోషారోపణము చేయుచున్నారా? మీకేమో యింతవరకును యోగ్యు లనుకొనుచున్నాను.