పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చినది? ఏమని వచ్చినది?" అని రాజశేఖరుఁడుగా రత్యాతురతతో నడిగిరి. "నేనంత ఖండితముగా వర్తమానము పంపిన తరువాత వారు మఱియొకలాగునఁ జెప్పెదరా? చేసికొనియెద మని జాబు వ్రాసి పంపినారు" అని యొక తాటాకుచుట్టను చేతి కిచ్చెను. దానిని చదువుకొని రాజశేఖరుఁడుగారు పరమానంద భరితు లయిరి. అప్పడే రాజుగారు సుబ్బారాయఁడు సిద్ధాంతిని పిలిపించి వివాహమునకు ముహూ_ర్తము పెట్టుఁ డని నియమించిరి. అతఁడు పంచాంగమును జూచి యాలోచించి వైశాఖ బహుళ సప్తమి గురువారము రాత్రి 24 ఘటికల 18 విఘటికలమీఁదట పునర్వసు నక్షత్ర మేషలగ్నమందు ముహూర్తము నుంచెను. వెంటనే పెండ్లి పనులు చేయుట కారంభింప వలసిన దని చెప్పి "మీకు ఖర్చున కిబ్బందిగా నున్నయెడల ప్రస్తుత మీనూరు రూపాయలను పుచ్చుకొని మీచేతిలో నున్నప్పడు నెమ్మ దిగా తీర్చవచ్చు"నని శోభనాద్రిరాజుగారు పెట్టెతీసి రూపాయలను రాజ శేఖరుడుగారి చేతిలోఁబెట్టి "సామిగా" అని సేవకు నొక్కని బిలిచి "నీవీ వారముదినములను పంతులుగారితో కూడ నుండి వారేపని చెప్పినను చేయుచుండుము" అని చెప్పి యొప్పగించెను. రాజశేఖరుఁడు వానిని తీసికొని యింటికిఁ బోయిరి.

ఆ దినము మొదలుకొని ప్రతిదినమును రాజశేఖరుఁడుగారు పెద్దాపురమునకు వెళ్ళుచు కందులు మొదలుగాఁ గలవానినెల్ల కొనితెచ్చి ఆదివారపుసంతలో కూరగాయలను దెప్పించిరి. ఈ విధముగా పెండ్లి పనులను సాగించుచు పంచమినాఁడు సీతను పెండ్లికూఁతునుగా జేసిరి. ఇక రేపురాత్రి పెండ్లియనఁగా షష్టినాఁడురాత్రి చేతిలో కఱ్ఱ పట్టుకొని గొంగళి ముసుగుపెట్టుకొని యొక కూలివాడు చీకటిలో వచ్చి రాజమహేంద్రవరమునుండి యుత్తరము తెచ్చినానని యొక తాటాకుచుట్టను సీతచేతి కిచ్చెను. ఇంతలో మాణిక్యాంబ లోపలి నుండి వచ్చి సీత చేతిలోని యుత్తరమును పుచ్చుకొని రాజశేఖరుఁడు గారు పెద్దాపురము వెళ్ళి రాలేదనియు వచ్చెడిసమయమైనది గనుక వచ్చినదాఁక వీధిలో నిలుచుండవలసిన దనియుఁ జెప్పి లోపలికిఁ