బోయెను. రాజశేఖరుడుగారు వేగిరము రాకపోఁగా కూలివాఁడు తొందరపడుచుండుటను జూచి మాణిక్యాంబ వానికి తవ్వెడు బియ్య మును డబ్బును ఇచ్చి పంపివేసెను. ఆ వెనుక సీత 'నాన్నగారు వచ్చుచున్నారేమో చూచి వచ్చెద' నని వీధిగుమ్మములోనికి వెళ్ళి 'ఇప్పడువచ్చిన కూలివాఁడు కఱ్ఱ దిగఁ బెట్టి పోయినాఁ'డని యొక చేతి కఱ్ఱను దెచ్చి వాఁడు మరల వచ్చి యడిగినప్పడియ్యవచ్చునని పడక గదిలో మూలను బెట్టెను.
కొంతసేపటికి రాజశేఖరుఁడుగారు వచ్చి భార్య రాజమహేంద్ర వరమునుండి యుత్తరము వచ్చిన దని చెప్పి చేతికియ్యఁగానే దీపము వెలుతురునకుఁబోయి సగము చదివి చేతులు వడఁకఁగా జాబును క్రిందపడవయిచి కన్నుల నీరు పెట్టుకొన నారంభించిరి. జాబులో నేమి విషయము లున్నవో వినవలె నని చేరువను నిలువఁబడియున్న మాణిక్యాంబ మగనిచేష్టలు చూచి తొందరపడి యేమియు తోచక ఖేదపడియెద రేమని యడిగెను. అతఁడు గద్గదస్వరముతో మన రామ మూర్తి విశూచి జాడ్యముచేత నిన్న మధ్యాహ్నము కాలముచేసినాఁ డని చెప్పెను. అంత వారిద్దరును గొంతసేపు విచారమును పొందిరి.
ఆ మఱునాఁడు ప్రాతఃకాలముననే రాజశేఖరుఁడుగారు బయలు దేఱి శోభనాద్రిరాజుగారి యింటికిఁబోయి తన పినతండ్రి కొమారుఁ డయిన రామమూర్తిగారి మరణమువలన సంభవించిన దురవస్థను జెప్పి ముహూర్త మశుచిదినములలో వచ్చుటచేత వివాహకార్యము నకు సంభవించిన యాలస్యమునకును నష్టమునకును కొంత చింత పడి పెండ్లికుమారునివారు తరలి రాకుండ వెంటనే వర్తమానము చేయుఁడని కోరిరి. శోభనాద్రిరాజుగారును ఆయనను గొంచె మూరార్చి తక్షణమే పెద్దాపురమునకు మనుష్యునిఁ బంపిరి. పిమ్మట రాజశేఖరుఁడుగా రింటికిఁ బోయిరి.
తరువాత వచ్చిన యాదివారమునాఁడు రాజశేఖరుఁడుగారు భోజనము చేసి కూరలకావళ్ళను కూలివాండ్రచేత మోపించుకొని వానిని విక్రయించివేయుటకయి పెద్దాపురము సంతకుఁ బోయి యొక