పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అను శ్లోకమును జదివి, సంక్రాంతి పురుషుని లక్షణమును వివరించి సంవత్సర ఫలమును జెప్పి, ధాన్యాదులయొక్కయు వృశ్చికాదుల యొక్కయు వృద్ధి క్షయములను జదివి, జన్మనక్షత్రములను తెలియని యెడల నామ నక్షత్రములను తెలిసికొని యెల్లవారికిని కందాయముల యంకములను ఆదాయవ్యయములను జెప్పెను. అక్కడనున్న కాపులు మొదలగువారు సిద్ధాంతిగారిచేతిలో నేమైనఁబెట్టి తమ కేకందాయము నందును సున్నలు రాకుండఁ జేసికొనిరి. పంచాంగశ్రవణ మయిన తరువాత రామమూర్తిగారు__"సిద్ధాంతిగారూ! కలియుగము ప్రారంభ మయి యిప్పటి కెన్ని సంవత్సరము లయినది?"

సిద్ధాంతి__ఇప్పటికి కలియుగాది గత సంవత్సరములు ౪౭౧౯, శాలివాహన శకొబ్దములు ౧౫౪౧, విక్రమార్క శక సంవ త్సరములు ౧౬౭౬.

రామ__మనదేశములో మ్లేచ్చుల యధికార మింకను ఎంత కాలముండునో కాలమానమునుబట్టి చెప్పఁగలరా?

సిద్ధాంతి__మనదేశములో తురుష్కుల దొరతనము అయిదు వందల సంవత్సరములకు లోపల పోదు. ఆ పిమ్మట పూసపాటి వారి వంశమున వేపకాయంత తోకగలవా డొకఁడు పుట్టి, ఆసేతు హిమాచలమునగల సర్వప్రపంచమును మరల జయించును.

అంత ప్రదోషసమయమయినందున పంచాంగము కట్టిపెట్టి యందఱును తమ తమ యిండ్లకు నడచిరి.

రాజశేఖరుఁడుగారు విదియనాఁడు కాశీయాత్రకు బయలుదేఱ నిశ్చయించుకొని యెంద రెన్నివిధములఁ జెప్పినను వినక ప్రయాణ ముహూర్తమును పెట్టుటకై గుడిలో పంచాంగమును జదివిన పిడపర్తి శ్రీరామసిద్ధాంతిని పిలిపించిరి. ఆతఁడును తిధివారనక్షత్రము లను చక్కఁగా నాలోచించి యారాత్రియే పదియారుఘటికల తొమ్మిది విఘటికలమీఁద యాత్రకు యోగ్యసమయమని ముహూర్తముంచెను. ఆ సమయమున కుటుంబముతో బైలుదేరుట క్షేమకరము కాదని యెంచి, రాజశేఖరుఁడుగారు పొరుగింట నొకవస్త్రమును దానిలో