పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖరుఁడుగారు కొన్నిదినములు రామమూర్తిగారి లోపలనే యుండిరి. ఒకనాడు పడవమీద గోవూరునకుఁ బోయి యచట బూర్వము గౌతముఁడు తపస్సు చేసిన స్థలమును మాయగోవు పడిన చోటును జూచి గోపాదక్షేత్రమున స్నానముచేసి రాత్రికి మరల వచ్చిరి; మఱియొకనాడు కోటిలింగక్షేత్రమున స్నానమునకుఁ బోయి యచట నొక శాస్త్రులవలనఁ బూర్వ మాంజనేయు లొక లింగము నెత్తుకొనిపోయి కాశీలో వేయుటయు అప్పటినుండియు కాళికాపట్ట ణము ప్రసిద్దిగనుటయు మొదలుగాగల కథను వినిరి. ఇంకొక నాఁడు రాజరాజనరేంద్రుని కోటకుఁ బోయి అందులోఁ బూర్వము చిత్రాంగి మేడయున్న తావును సారంగధరుఁడు పావురముల నెగరవేసిన చోటును జూచి, పూర్వము రాజరాజనరేంద్రున కమ్మవారు ప్రత్యక్ష మయు నీ వెంతదూరము వెనుక తిరిగి చూడకుండ నడతువో యంత దూరము కోటయగునని చెప్పటయు అతఁడాప్రకారముగా నడచుచు వెనుక గొప్ప ధ్వని యగుచుండఁగా గొంతసేపటికి మనస్సు పట్టలేక వెనుక తిరిగి చూచుటయు, చుట్టును బంగారుకట్టుతో నించుమించుగా ముగియవచ్చిన కోట యంతటితో నిలిచిపోవుటయు, మొదలుగాఁ గల కథను దగ్గఱనున్న వారివలన రాజశేఖరుడుగారు సారంగ ధరుని కాళ్ళను చేతులను నఱికిన స్థలమును జూచిరావలె నని బయలుదేఱి సారంగధరుని మొట్టకుఁ బోయి యక్కడ నొక నిమ్మ చెట్టుకింద సారంగధరుని కాళ్ళను, చేతులను ఖండించిన చాపరాతిని, దాని చుట్టును గడ్డి సహితము మొలవక నున్న ప్రదేశమును దాని సమీపముననే సిద్దుఁడు సారంగధరుని గొనిపోయి స్నానము చేయించిన కొలఁకును జూచి వచ్చిరి. రాజమహేంద్రవరములో నున్న కాలములో రాజశేఖరుఁడుగారు పట్టణములో నుండెడి జనులకును, పల్లెలలో నుండెడి జనులకును నడవడియం దేమివ్యత్యాస ముండునో చూడవలెనని యెల్లవారియొక్క చర్యలును బరీక్షింప సాగిరి. కాబట్టి యిప్పుడిప్పుడాయనకు నిజమయిన ప్రపంచజ్ఞానము కొంతవఱకు గలుగ నారంభించెను. ఆ పట్టణములో __ ఎరువడిగి