పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తలుపువద్ద బొబ్బలు పెట్టినమీఁదట చావడిలోఁ బరున్న వారెవ్వరో లేచివచ్చి తలుపుతీసిరి. రాజశేఖరుడుగారి మాట వినఁబడినతోడనే లోపలిగదిలోఁ బరుండియున్న రామమూర్తిగారు లేచివచ్చి, అన్న గారిని కౌగలించుకొని వారావఱకే వత్తురని కనిపెట్టుకొనియుండి జాము ప్రొద్దుపోయిన మీఁదటనుగూడ రానందున, ఆ దినము బయలుదేఱలేదని నిశ్చయించుకొని భోజనములుచేసి తామింతకు మునుపే పడుకొన్నామని చెప్పి యంతయాలస్యముగా వచ్చుటకుఁ గారణమేమని యడిగిరి. తాము చెప్పనక్కఱలేకయే తమ బట్టలను మోకాలివఱకును బురదలో దిగబడిన కాళ్ళను జెప్ప సిద్ధముగా నున్నదానినిమాత్ర మాలస్యకారణముగాఁ జెప్పి బండిని దామీడ్చుకొని వచ్చిన సంగతిని మాత్రము చెప్పక రాజశేఖరుఁడుగారు దాచిరి. అప్పు డీయవలసిన బండికూలి నిచ్చివేసి బండివానిని పొమ్మని చెప్పఁగా వాఁడు తాను విశేషముగా శ్రమపడితి ననియు తన బండియెడ్లంతటి మంచివి మఱెక్కడను దొరకవనియఁ జెప్పి తన్నును తన యెడ్లను గొంతసేపు శ్లాఘించుకొని బహుమతి రావలెనని యడిగెను. తడవుగ మాటాడనిచ్చినయెడల మాట వెంబడిని బండిని తాములాగుకొనివచ్చిన మాటను చెప్పునేమో యనుభయమున సామాను దిగినతోడనే బహుమతిని సహిత మిచ్చి రాజశేఖరుఁడుగారు వెంటనే వానిని బంపివేసిరి. కొత్తగా మగడుపోయినవారిని పుణ్యస్త్రీలు భోజనము లయిన తరువాత మొదటిసారి చూడరాదు గనుకను, ఆ రాత్రి మంచిదినము కాదు గనుకను, సువాసినుల నందఱును గదిలోనికిఁ బోయి తలుపు పేసికొండని చెప్పి యొక విధవ ముందుగా రుక్మిణిని లోపలికిఁ దీసికొనివచ్చి మఱియొక గదిలోనికిఁ బంపి తలుపు దగ్గఱగా వేసెను. తరువాత లోపలినుండి యాడువారు వచ్చి మాణిక్యాంబ మొదలైన వారిని పడమటింటిలోనికిఁదీసికొనిపోయి రుక్మిణికి దటస్థించిన యవస్థ కయి యేడుపులు మొదలైనవి చల్లారినపిమ్మట, వారినిమిత్త మా వఱకు చేసిన వంట మిగిలియున్నది కాన వారికి వడ్డించి రాజశేఖ రుఁడుగారి నిమిత్త మప్పుడత్తెసరు పెట్టిరి. అందఱును భోజనము లయినతరువాత మూడుజాములకు పరుండి సుఖనిద్రచేసిరి.