పుట:Neti-Kalapu-Kavitvam.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దృష్టివిచారాధికరణం

115


చూస్తున్నాను అట్లాటి సత్య ప్రకటనానికి ధ్యానాచరణాలు ప్రధాన మవుతున్నవని యిదివరకే తెలిపినాను. ఆసమయంలోనే సత్యస్వరూపం సాక్షాత్కరిస్తున్నది.

యెంకిపాటలు, సుమబాలవంటివి కొన్నిమాత్రమే ఆత్మ నాయకత్వం చేత వచ్చిన సంకుచితదృష్టిలేనివి కనబడుతున్నవి. భక్తివంటి భావనను సయితం శ్రీభాగవతకర్త ప్రహ్లాదాదులకు సమర్పించి లోకానికి ప్రసాదించాడు. ఆలంబనంయొక్క ఉత్తమత్వాదులు శృంగారాదులకువలె కరుణానికీ, భక్తికీ, జడ,శిశు ప్రకృతులమీదిప్రేమ మొదలైన భావాలకు అంతగా ప్రధానంగావు. గనుకనే దాశరథీశతకప్రభృతులు మనకు ఉపాదేయంగా వున్నవి. అదీగాక భక్తికి ఆధారమైన భగవంతుడు సకలకల్యాణగుణసంపన్నుడు శిశుజడప్రకృతులమీది ప్రేమకు ఆధారమైన శిశుజడప్రకృతుల వినిర్మలత్వం ముగ్దసౌందర్యం మొదలైనవి అకలుషితధర్మాలు., కనుకనే వీటికి ఆలంబనంయొక్క ఉత్తమత్వాది విచారణ అంతగా ప్రధానం గాదంటున్నాను. శృంగారాదులకు ఆలంబనమైన నాయకులు నాయికలు కామపశుత్వం లోక నిశ్రేయసవిరోధి అయిన అధర్మపరత్వం మొదలైనవాటికి ఆకరులు తరుచుగా అవుతూవుండడం మనకు విదితమయ్యేవున్నది. కనుకనే భక్తిమొదలైనవి తప్ప శృంగారాదులు ఆలంబన ప్రధానంగా వుంటవంటున్నాను. అందువల్ల లోకంలో యేకదేశంలో వుండే భక్తిమొదలైన వాటివలెగాక సాధారణంగా సర్వమానవప్రకృతిని వశంజేసుకొని అభ్యుదయవినాశాలకు రెంటికి హేతువుకాగల శృంగారాదుల భావాల ప్రతిపాదనంలో కృతికర్త యెంతోవివేకాన్ని బుద్దిపరిణతిని ఔచిత్యాన్ని వినియోగించ వలసివుంటున్నది. అందుకే ఆలంబనవైవిద్య వికాసాలను గోల్పోయి ఉత్తమత్వాదులను ప్రతిపాదించకుండా శృంగారాదులకు తమనే నాయకులను జేసుకొన్న కృతికర్తలు సంకుచిత దృష్టులైరంటున్నాను.