పుట:Navanadhacharitra.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

147

బనిలేదు వినుఁ డని ◆ బాలఁ దోడ్కొనుచు
సచివులతోఁగూడఁ ◆ జని బహు (రత్న)
నిచయముల్ నిండార ◆ నించిన పసిఁడి
మందసంబున నుంచి ◆ మఱితెప్పమీఁదఁ
బొందుగా నునిచి కొం ◆ పోయి నట్టేటి
వడిఁ బాఱి విడిపించి ◆ వచ్చె నావిప్రు
కడఁ గూడి చదువు వె ◆ క్కలి బ్రహ్మచార్ల
నటమట నొజ్జలు ◆ నంతకు మున్ను
తటుకున నరిగి మం ◆ దసఁ బట్టు డనుచుఁ
బంపిన నందఱు ◆ బఱచి యయ్యేటి
వంపున మందస ◆ వచ్చునంతకును
నెదురు చూచుచునుండి ◆ యేటితీరమునఁ
బొదరిండ్లలోపలఁ ◆ బొంచున్న యంత
నభినవ కందర్పుఁ ◆ డన నొప్పుభూమి
విభుఁడొక్కఁ డడవికి ◆ వేఁటమై వచ్చి
కడుదూపటిలి యుద ◆ కంబులు గ్రోలఁ
దడయక యయ్యేటి ◆ దరి కేగుదెంచి
రంగదుత్తుంగ త ◆ రంగఘట్టనలఁ
గ్రుంగుచు నెగయుచుఁ ◆ గూలంబుఁ జేర
వచ్చునందసఁ గని ◆ వడి నీతగాండ్లఁ
బుచ్చి తెప్పించి త ◆ ల్పులు బారు దెఱచి
కరసానదీర్చి యం ◆ గజుఁ డొరలోన
కరమొప్ప నునిచిన ◆ కరవాలువోలె
నెరసంజమబ్బులో ◆ నిగనిగమించు
నెరయ దీపించు క్రొ ◆ న్నెలసోగవోలె
సలలితరత్న పం ◆ జరములోఁ జాలఁ
జెలువారు ముద్దురా ◆ చిలుక చందమున
సన్నుతరత్నభూ ◆ షణదీప్తు లెసఁగ
నున్నట్టి బోఁటిని ◆ నుడురాజవదనఁ
జకితకురంగలో ◆ చనఁ గంబుకంఠిఁ
బికవాణిఁ బరిపక్వ ◆ బింబాధరోష్ఠిఁ
గుసుమకోమలిఁ గుంద ◆ కుట్మలరదనఁ
గిసలయపాణినిఁ ◆ గేసరగంధిఁ