పుట:Navanadhacharitra.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiv

ఈ పద్యము రామాయణ కథకు సంబంధించినదిగా నున్నది. మొత్తముమీఁద నితరాధారములేమైన దొరకనినాడు, ఈతఁడే నవనాథ చరితమును బద్యకావ్యముగా రచించిన శ్రీగిరికవియని నిశ్చయించుట కవకాశము లేదు. శ్రీగిరికవి పద్యకావ్యముగా రచించిన యీ నవనాథుల చరిత్రమును శాంతరాయఁడు ద్విపదకావ్యముగా రచింపఁ బ్రోత్సహించుట యీ శైవకథలు జనసామాన్యమున వ్యాప్తినొందవలయు ననియే యై యుండుననుటకు సందేహము లేదు. సామాన్యముగా నార్యమత మగ్రవర్ణములవారి యాదరమును బడసినదగుటచే, సామాన్యజనము నాకర్షించుటకు మతబోధ ప్రచారము ప్రధానముగా నెంచిన శైవగురువులు సర్వజన సుబోధకంబగు సులభశైలిలో రచింపఁబడిన ద్విపదకావ్య రచనమును ప్రోత్సహింపఁ జొచ్చిరి. పాల్కురికి సోమనాథుఁ డారూఢగద్యపద్యాదిప్రబంధపూరిత సంస్కృతభూయిష్ఠ రచన సర్వసామాన్యంబు గాదు గావునఁదాను ద్విపదలను రచింప దొరకొనినట్లుచెప్పియే యున్నాఁడుగదా. ఈ శైవు లవలంబించిన మార్గము ననుసరించియే కావలయు, వైష్ణవ మతాభిమానులచే రామాయణాదులు గూడ నాయ కాలముల ద్విపదరూపమును బొందింపఁ బడియున్నవి.

శైవసిద్ధులగు నీ నవనాథులవలెనే, వైష్ణవసిద్ధులగు నవనాథులు గూడఁ ప్రసిద్ధులై యున్నట్లు తోఁచుచున్నది. ఈ వైష్ణవసిద్ధు లగు నవనాథులచరితము మహారాష్ట్రభాషలో మాలూపండితునిచే రచింపఁబడియుండెను. దాని యాంధ్రానువాద మొకటి 'నవనాథచరిత్ర'మను పేరఁ బ్రకటితంబై యున్నది. కాని యిది మిగుల నర్వాచీనంబుగాఁ గనఁబడుచుండుటచేతను, మత్స్యేంద్రనాథుఁడు, గోరక్షుఁడు, చౌరంగి మొదలగు సిద్ధులనామములయందు జర్యల యందును గూడ నీవైష్ణవ నవనాధులకును శైవ నవనాథులకును బోలిక లగ పడుటచేతను, శైవనాథుల చరిత్రము దేశమున వ్యాప్తిఁ చెందిన పిదప, దానికిఁ బ్రత్యర్థిగా వైష్ణవమత ప్రతిపాదకంబగువేఱొక నవనాథచరిత్రము రచింపఁబడినదని తోఁచుచున్నది. గౌరనకావ్యమైనను, "కేవల మంత వీరశైవ ప్రతిపాదకంబైనదిగాఁ దోఁపదు. ఏలయనఁగా, నిందొకచో విష్ణువుప్రశంస గూడఁ గొంత కల్పిఁబడినది. లోకరక్షణార్థమై విష్ణువు శైవనాథుల చర్యలను గూడఁ బ్రతిఘటించి శైవనాథుఁడగు నాగార్జునశిష్యుఁడు శ్రీశైలము నంతను హాటకాచలముగా నొనరింపఁజేసిన యత్నమునకు భంగ మొనర్చి, యా నాగార్జున శిష్యునిఁ దనచక్రముచేఁ జంపినట్లు చెప్పఁబడినది.

"గాసిగా శిక్షింపఁ గలవా రుపేక్ష
 చేసిన దోషంబు సిద్ధించుఁగాన