పుట:Navanadhacharitra.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiii

రచించినట్లు కొందఱు చెప్పుదురు. మడికిసింగన తన 'సకలనీతి సమ్మతము'న శ్రీగిరీశశతకమునందలి వని రెండు సీసపద్యముల నుదాహరించి యున్నాఁడు. కాని, యవి యీ శ్రీగిరికవి రచించినవే యని నిశ్చయముగాఁ జెప్పుట కాధారము లేదు. "చిరతర ప్రకాళ శ్రీగిరీశ" యని శ్రీగిరీశ సంబోధనతోఁ గూడిన మకుటమును బట్టియే దాని కా పేరు వచ్చినను వచ్చియుండవచ్చును. వేమనశతకకర్త వేమన యైనట్లే, శ్రీగిరీశ శతకకర్త శ్రీగిరియే యని యూహింపఁ బడియుండును.

శ్రీగిరన్న (చెన్నమల్లు) రచించిన శ్రీరంగ మాహాత్మ్యము లోనివని రెండు పద్యములు శ్రీ ప్రభాకరశాస్త్రులుగారి ప్రబంధరత్నావళియం దుదా హృతములు. ఆతఁడు నవనాథచరిత్ర మను శైవగ్రంథమును బద్యకావ్యముగా రచించిన శ్రీగిరికవియే యని నిశ్చయించుట కాధార మేమియుఁ గనఁ బడదు. ఇంతేగాక శైవకవియగు నీతఁడు 'శ్రీరంగ మాహాత్మ్యము' వంటి వైష్ణవ గ్రంథమును రచించునా యను సందేహము కూడఁ గలుగక మానదు. శ్రీగిరికవిశ్రీరంగమాహాత్మ్యములోని దని గ్రహింపఁబడినట్టియు, శంకరుఁ డాదిమూర్తి యుచితరీతిని బేరోలగం బుండుటను గూర్చి వర్ణించునట్టియు నీ క్రింది పద్యమునకు శ్రీరంగమాహాత్మ్యకథనుబట్టి చూడఁగా నా గ్రంథమున నేమియుఁ బ్రసక్తికలుగునట్లు గానవచ్చుట లేదు.

“సీ. దీపించు నే వేల్పు దివ్యాంగకంబులఁ
                 గాళీకుచాంగరాగంబు భూతి
     కొమరొందు నే వేల్పు గురుజటాభరసీమ
                నమృతాంశుఖండంబు నభ్రగంగ
     కడుమించు నే వేల్పు గాత్రవల్లికచుట్టు
               వ్యాఘ్రచర్మము వారణాజినంబు
     కరమొప్పు నే వేల్పు కంఠపీఠంబున
               భుజగేంద్రహారంబు పునుక పేరు

తే. అట్టి వేలుపు శంకరుం డాదిమూర్తి
    వేద వేదాంత వేద్యుండు విశ్వభర్త
    వికసితోజ్జ్వల వదనారవిందుఁ డగుచు
    నుచిత రీతిఁ బేరోలగం బున్నయంత. ”

"శా. సంతోషంబునఁ బొందియేలె విమలస్వాంతున్ మహాదానవ
     ధ్వాంతవ్యూహ విదారణోజ్జ్వల వివస్వంతున్ యశఃపూరితా
    శాంతున్ సాహసవంతు నిర్భరజయాయత్త్రైకవిశ్రాంతు ధీ
    మంతున్ భర్మనగేంద్రకాంతుని హనూమంతున్ జవాత్యంతునిన్