పుట:Navanadhacharitra.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xv

 నేనే జగంబు లన్నియును రక్షింపఁ
 బూనిన లక్ష్మీవిభుఁడ ననిచెప్పి
 యంతర్హితుండయ్యెఁ" ననియుఁ గలదు.

ఇట్లు శైవనాథులులోకప్రసిద్ధంబుగాఁ జేయఁదలఁచిన రసవాదాది కృత్యములకు భంగము గలిగించుటేగాక, తానె జగంబు లన్నియు రక్షింపఁ బూనిన లక్ష్మీవిభుఁడ నని ప్రకటించుకొనువిష్ణువు మాహాత్మ్యమును గూడ వర్ణించిన దగుటచే నిది కేవలము వీరశైవపరము కాదనియు, నేత ద్గ్రంథరచనా కాలమునకే వీరశైవ మతముయొక్క పట్టు కొంచెము తగ్గినదనియు, గౌరన యట్టి కేవల వీరశైవ సంప్రదాయములోనివాఁడు కాఁడనియుఁ దలంపవలసియున్నది. కథారంగము, ఆంధ్రదేశ సంబంధము:

ఈ నవనాథుల చర్యలకుఁ బ్రధానరంగము మహారాష్ట్రదేశభాగముగాఁ గనఁబడుచున్నది. శివపుత్రుఁడగు మీననాధుఁడు తండ్రివలన నధ్యాత్మవిద్యోప దేశమును బొంది, ధరణిపైఁ జరియింపఁబొమ్మన నాతని యజ్ఞవడసి, భూలోకమునఁ గలికాలంబున సులలిత యోగాబ్ధిచంద్రుండై -

కాళింగ బంగాళ కరహాట లాట
గౌళ కేరళ చోళ కర్ణాట ఘోట
కుకురు గొంకణ పౌండ్ర కురుకోసలాది

సకలదేశంబులును దిరిగి, మాళవదేశంబున రాజమహేంద్రనరేంద్ర పరిపాలితం బగు మాంధాతపురమునఁ దొలుతవిడిసినవాఁడయ్యెను. ఈ సందర్భమున నీతఁడు తిరిగిన దేశములలో నాంధ్రదేశ మున్నట్లు చెప్పఁబడి యుండలేదు. ఈతఁడు తొలుత వాసమేర్పఱచు కొన్నట్లుగాఁ జెప్పఁబడినది మాళవదేశమునందలి మాంధాతపురముగాని యది యాంధ్రదేశమునం దేపట్టణమునుగాదు. ఈ మాంధాతపురాధీశుఁడగు రాజమహేంద్రుని కుమారుఁడు సారంగధరుఁడు. ఈతని కథ యంతయు నీ మాలవదేశగతమగు మాంధాతపురముననే జరిగెననియు, తత్ పురసమీపమునందలి కొండలలో వాస మేర్పఱచుకొనియున్న మీననాథుని యనుగ్రహమువలననే యీతనికిఁ గాలుసేతులు మరలఁ గలుగఁగాఁ, ఔరంగి యనునామమున సిద్ధుఁడై యాతని శిష్యులలో నొకఁడయ్యె ననియు, నీ రాజమహేంద్రుని యాలమందలను గాచు గోరక్షుఁడు గూడ నాతని ముఖ్యశిష్యులలో నొకఁడై , యోగ సామ్రాజ్య పట్టభద్రుఁడయ్యె ననియుఁ జెప్పఁబడినది. ఆ రాజమహేంద్రుఁడును “సుతు నాజ్ఞ పెట్టించి, సురసుర వెచ్చి, మతిఁదప్పి "తేజంబుమాలి యావెన్క నంతకగోచరుండై "న పిదపఁ దజ్జనపదంబెల్ల జనశూన్యమై, మాంధాతపురంబును మటుమాయ మయ్యెనఁట. పిమ్మట శిష్యులఁగూడి మీననాథుఁడు మాల్యవంతంబున కేగి,