పుట:Narayana Rao Novel.djvu/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వి వా హ ము

49

మేడలకు నాతిదూరాన రెండు మహాభవనములు మగపెండ్లి వారికి విడిది లేర్పరచిరి. విడిదికడనుండి జమిందారు గారి మందిరములవరకు నొక పందిరి. విడిదిల కడను, జమీందారు గారి మేడలకడను, చాందినీలు, గులోబులు, అగరునూనెల గాజుదీపాలబుడ్లు, తీగెల పండ్ల గెలలు, మెరుపుల పాదరసపుబుడ్లు, బుట్టలు, పూలతోరణములు, కొబ్బరికాయల గెలలతో పందిళ్ళలంకరించినారు.

జమిందారు గారి విశాలభవనములో విశాల సభాస్థలమున వివాహ వేదిక నమర్చినారు. చిత్రాలంకార శోభితమై యా వేదిక దివ్యమై వెలుగొందు చున్నది. వివాహసభామందిర మంతయు జుట్టములచే, సభ్యులచే గ్రిక్కిరిసి పోయినది. న్యాయవాదులు, జిల్లాకలెక్టరు, జమిందారులు, జిల్లా జడ్డి, పోలీసు సూపరింటెండెంటు, ఇంక ననేకులు ఉద్యోగులు, పురప్రముఖులు సభ నలంకరించినారు. ఆంధ్రాది దేశములనుండి పేరెన్నికగన్న వారెల్లరు ఆనాడు సభాభవనమున గ్రిక్కిరిసినారు. అందఱకు బఱపులు, దిండ్లు నమర్చినారు. పెండ్లి వారందఱు నొకయెడ నధివసించినారు.

పొన్నుస్వామి సన్నాయి మేళము వచ్చినది. మంగళ వాయిద్యములు భోరుమనినవి. ‘అయంముహూర్త స్సు ముహూర్తోస్తు’ అనుచు బురోహితులు మంత్రములు చదివిరి.

సభామధ్యమున నయిదువేల తులముల వెండిగంధపుగిన్నెయు, బంగారు పన్నీరుబుడ్డియు, బంగరు అత్తరువులదానును నొక దంతపుబీఠికపై నమర్పబడెను. సభలో నచ్చటచ్చట బీఠములపై సువాసన ధూపముల నెగజిమ్ము బరిణ లమర్చినారు.

పండితోత్తములు సముద్ర గంభీర స్వనముల వేదఘోష సలుపుచున్నారు.

ఆడువారికి వివాహవేది కు సమీపమున తెరలమధ్య నొక స్థల మమరించినారు.

సర్వాలంకార శోభితయై, పాలసముద్రమున జన్మించిన లక్ష్మీబాలవలె నున్న పెండ్లికొమరిత, శారదను గంపలో గొనివచ్చినప్పుడు, పట్టు పీతాంబరముల ధరించి, వెడదయురమున హారములు శోభింప నారాయణరావు నాందీ శ్రాద్ధమునకు లోనికి బోవునప్పుడు, జమిందారుగారు భార్యాసమేతులై సాలంకృత కన్యాదానము చేసి ధన్యులగునప్పుడు, నూతన వస్త్రాలంకార శోభితులై వధూవరు లొండొరుల ప్రక్క నధివసించినప్పుడు, మంగళ వాద్యములు బోరన విప్రాశీర్వాదములు దిశలునిండ నారాయణరావు శారదకు మంగళసూత్రధారణ కావించునప్పుడు, వధూవరులు తలబ్రాలు పోసికొనునప్పుడు జానకమ్మగారును దక్కుంగల చుట్టము లెల్లరు నపరిమిత సంతోషమున నోలలాడిరి.

వివాహ సమయమున జమిందారుగారు భూరిసంభావన లిచ్చినారు. రాజమహేంద్రవరములోని వితంతూద్వాహ మండలివారికి వేయిన్నూటపదాఱు లిచ్చిరి.