పుట:Narayana Rao Novel.djvu/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

నా రా య ణ రా వు


వలననో మెదడు పనిచేయుటచే నిదురబట్టదు కాబోలు! తన బావమరది ఖండాంతరములకుపోయి యశస్సు గడించివచ్చును. ఇందు విషాదకారణ మేమున్నది? సూర్యకాంతమన్న దనకు నెక్కుడు ప్రేమ. ఆ బాలకు గష్టము కలుగు నేకార్యమైన దనకు విషాదము కలిగించును. కావుననే నేడు తానట్లు గజిబిజిపడిపోవుటకు గారణమైనది.

అహో! యీ నిర్మలాకాశమున మిరుమిట్లుగొలుపు నీ వేలకొలది తారలు నిశ్శబ్దగీతికలు పాడుకొనుచున్నవి. ఈ నిశ్చలత ధ్వనిపూరితమయ్యు నిశ్చలత యెట్లయ్యెను? ఈ నిశ్శబరాగాన, నీ కీచురాళ్ళు నిద్రలోని ఉచ్ఛ్వాస నిశ్వాస స్వనములు, దొడ్డిలోని యావుల కదలికలు, నక్షత్రమండలమునుండి రాలిపడు నుల్కలు, దారినిబోవు బడిగంట, యుదయించు చంద్రకిరణము, నెటనుండియో వినవచ్చు బాలకుని యేడ్పు– నీవియన్నియు, నెట్లు సమన్వయింప బడినవో! ఒక్క రాగములోని స్వరకల్పనమైనవి.

నారాయణరావు హృదయమున నీయఖండసృష్టిపై ప్రేమ పొంగిపొరలి పోయినది. ఆతడు భూమ్యాకాశముల నిండినట్లయినది. నీలగగనము, నిశ్చల తారకలు నాతనిలో లీనమైపోయినవి. తనకు బ్రాణవల్లభగా నిశ్చయింపబడిన శారదాదేవీస్వరూపమై ప్రకృతి తన్ను కౌగిలించుకొన్నది.

శారదాదేవి నిరుపమాన సౌందర్యవతి. తానెంత పుణ్య మొనర్చెనో యా బాలికను భార్యగా బడయుటకు, ఆమెతో దా నోలలాడనున్న స్వర్గ సౌఖ్యము లాతనికి గోచరించినవి.

తన్ను జిరునవ్వుతో, దారానయనములతో, చంద్రకాంతి పుష్పముల బోలు బుగ్గల సుడులతో జేరవచ్చు శారదలో లక్ష్మీపతిని, సూర్యకాంతమును, రామచంద్రుని విడివిడిగా జూచినాడు. వారలలో దనతల్లి గోచరించినది. అందఱు నొక్క సంశ్లేషంబున చంద్రబింబమై గగనవీధిపథముల నెటకో తేలియాడుచు బోవుచున్నారు. తా నేరి యంకముపైననో శిరము వాల్చి, శీతలమై, హంసతూలికాసమమై, మెత్తనగు నా తొడలో కరగిపోయినాడు. ఆ తొడయే చంద్రబింబమైనది.

రెండుగంటలు లోనిహాలులోని గడియారము ‘టంగు, టంగు’ మని పాడినది. నారాయణరావు నిదురలో మైమఱచినాడు.


౧౨

వివాహము

రాజమహేంద్రవరములో సమస్తవైభవములతో శ్రీ శారదా నారాయణరావుల వివాహమహోత్సవము జరిగినది.

అప్పురిలో జమిందారుగారి మందిరములన్నియు గన్నుల వైకుంఠముగ నలంకరించినారు. రోడ్లు, తోటలు పందిళ్లు వేయించినారు. జమిందారుగారి