పుట:Narayana Rao Novel.djvu/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

నా రా య ణ రా వు

జమిందారు గారి బంధువులు స్నేహితులు వధువునకు విలువగల బహుమతులు గొనివచ్చినారు. కొందఱు వెండి చెంబులు, కొందఱు కాఫీగిన్నెల దొంతరలు, గంధపుబుడ్లు, వెండి సబ్బు పెట్టెలు, బంగారు నగలు మొదలగు రకరకముల పారితోషికము లొసంగిరి.

పెండ్లికొమరిత చుట్టములందరు నవనాగరికులు. ఆంధ్రదేశములోని సంపన్న గృహస్థులు, ఎల్లప్పుడు పట్టుచొక్కాలు ధరింతురు. జుట్టు నున్నగా దువ్వుకొందురు. కంటి యద్దములజోళ్ళు వారికి సార్వకాలిక భూషణములే. ఆడువారికే కంటియద్దము లున్నవట. వారెప్పుడు నూరేగింపులకు రారు. సభల నలంకరింపరు. వారందరకు సేవకులు, సేవకురాండ్రు పెక్కు రుందురు. తమ బిడ్డలకు పాలిచ్చుకొను ముత్తయిదువులు వారిలోలేరు. కొందఱు బాలికలు కాళ్ళకు జరీ పువ్వుల మొఖమల్ జోళ్ళు సంతతము తొడిగికొని యుండుటచే పాదములకు బారాణిపూయుటకు వీలులేకపోయినదట.

మగవారు మగపెండ్లివారితో బంక్తిభోజనమునకు రాలేదు. అచటి గాయకుల గానసభలు వారి హృదయము లాకర్షింప లేదు. స్వంత బ్రాహ్మణులు దారిచూప వారికి వేరుగా నేర్పరచియున్న భోజనశాల కరిగి భోజనము చేయుట, వార్తాపత్రికలు, ‘నావెలు’ గ్రంథములు చదువుకొనుట, సిగరెట్లు కాల్చుకొనుట వారి దినచర్యయైయుండెను.

మగపెళ్ళివారు పల్లెటూరి వారు. ఆచారాదికములు వారికి మెండు. ఊరేగింపునకు వారుసిద్ధము. వెలగల బనారసు చీరలు ధరించుట, దేహమెల్ల బంగారు నగలు ధరించుట, పాదముల బసుపుపారాణులు పూయించుకొనుట, పేరంటములకు దండ తండములుగా వచ్చుట, పెండ్లిపాటలు పాడించుట, పాడుకొనుట మున్నగు బెండ్లితంతులెల్ల మగపెండ్లి వారి యాడంగులే గుత్తకు గైకొనిరి. వియ్యపురాలికి, నాడుబిడ్డలకు నయిదురోజులు మొగములు కడిగించుట మొదలగు తంతులన్నియు క్రమముగా జరుగవలెను గాన, ఇష్టము లేకపోయినను వరదకామేశ్వరీదేవి ప్రతివేడుకకు రావలసివచ్చినది.

మగపెళ్ళివారిలో మగవారు అన్ని సభలకు హాజరు. వారి సంగీత ప్రీతియు, దలలాడించుటయు, జేతులతో తాళము వేయుటయు వింతగా జెప్పుకొనిరి.

జమీందారిఫాయాలో జేరిన ఆడపెండ్లివారికి మగ పెండ్లివారి ఆడువారు కాళ్లకు నగలతో పసుపు బారాణులతో ముత్తయిదువులవలె కనిపించిరట. గజ్జలగుఱ్ఱములవలె దోచినారట!

‘ఇంత పల్లెటూరివాళ్లని మనం అనుకున్నామటమ్మా. వట్టి మోటు అడవి మనుష్యులవలె ఉన్నారు. ఈ సంబంధం ఎక్కడ తెచ్చారండీ అత్తయ్య గారూ!’ అని వరదకామేశ్వరీ దేవితో నొక దగ్గరిచుట్టము, సరోజని, యనినది.