పుట:Narayana Rao Novel.djvu/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

376

నారాయణరావు

‘సుజలాం సుఫలాం మలయజ శీతలాం, సస్యశ్యామలాం, మాతరం వందేమాతరం.’

ఆహా! తనతల్లి కెన్ని నదులు, ఎన్ని క్రీడాసరస్సులు, ముక్కారులు బండు కేదారములతో, ఒడలు మరపించు చల్లదనముతో తనతల్లి తన్ను చేరపిలుచుచున్నది.

‘శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం
ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం మాతరం.’

అడవుల, కొండల, పట్టణాల, బయళ్ళ, పొలాల, తోటల, నదుల, సమ ద్రాల చల్లగా ధవళమై పుచ్చపూవువలె పడు వెన్నెలచేత పులకించిపోదువా తల్లీ. అందములై, ఆనంద మనోహరములై, అపరమిత సువాసనాలహరీ పూరితములై వివిధ వర్ణాలంకారశోభితములై పూవులచే అలంకరింపబడిన దామాత. ఆమె శిరోజము లా హిమాలయములు! అందమగు కాశ్మీరము, తమతల్లికి ప్రఫుల్లమగు ముఖమా!

ఒహో మాతా! నీగతి దుర్భరము. కానిమ్ము పుత్రులు నిన్ను మరచెదరా! జగన్మాతా!

‘త్రింశత్ కోటి కంఠ కలకల నినాదక రాశే
ద్వాత్రింశతో కోటి భుజై ధ్రుతకరకర వాలే.’

తల్లిముఖాన వినవచ్చు భాషలన్ని విని ఎంత కాలమయినది. ముద్దులుగులుకు తెలుగుభాష వినరాక చెవులు తుప్పులు పట్టినవి.

‘ఆంధ్రదేశము మాకు అమరదైవతము’

తల్లీ! తెలుగుమాతా! నీ తీపిలో తానెప్పుడు లీనమగునో అమ్మా! గోదావరీ, పుణ్యస్రవంతీ, నీ గంభీరత, నీ ప్రేమ తాను మరువగలుగునా? ఎప్పుడు దూరాన నా పాపికొండలు, నీలోని లంకలు, నీ నీలజములు కన్నుల కరవుదీర చూడగలుగుదునోకదా?

కృష్ణా! పెన్నా! ఏ నాటికి మీ దర్శనము. రాజమహేంద్రనగరము, కాకినాడ పురము, కాకినాడయందలి వీధుల తాను నడచిపోవలయును.

ఆతని మనస్సు తళుక్కుమన్న ది. కొత్తపేట, అత్తవారిల్లు తన చిన్నారి భార్యయగు సూర్యకాంతము.

ఏమి తెలివైన దాబాల! ఎంత అందగత్తెయయినది. సంపూర్ణ ప్రౌఢవలె నెదిగినది. పదునేడేండ్ల బాలిక; ఆ భగవంతునిమాయ. లియొనారా తన లక్షల నెంచక, తన్ను సంపూర్ణముగ నర్పించుకొన్నదే! జాతికి జాతికి శ్రుతి కలియదా యేమి? తన సౌందర్యనిధి, సర్వకళాశోభిత సూర్యకాంత మేమిచేయు చుండునో! తన భర్త పరీక్షల జయమంది వచ్చుచున్నాడని లోన సంతోషించు చుండునో? పరీక్షలలో నెగ్గినదా? తప్పక నెగ్గును, నారాయణరావు బావ