పుట:Narayana Rao Novel.djvu/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అడ్వకేటు జనరలు గారు కాగితములన్నియు బరిశీలించి ‘ఇందులో ఇంతవరకున్నది రెండే సాక్ష్యములు: ఒకటి అమెరికా రహస్యచారుడు, రెండు విప్లవకారులలో ప్రభుత్వపక్షానికి తిరిగినవాడు. వాళ్ళు ఏమి చెప్పగలరు? ఒకడు రామచంద్రరావు పత్రికలో వ్రాసినట్లు, ఉపన్యాసమిచ్చినట్లు చెప్పును. మరియొకడు ఒకరాత్రి వీరందరును కలిసినట్లు మోము కప్పబడియున్నట్టు చెప్పును. వార్తాపత్రికలు సాక్ష్యములుగా పనికిరావు. రాత్రివేళ ఒకరినొకరు గుర్తించుట యెట్లు?

ప్రాణకాంత బోసు, గండార్ సింగుల కేసులో సంగతివేరు. వారు హిందూదేశమువచ్చి బాంబులు తయారుచేయుట మొదలుపెట్టినారు. ఇంకను హిందూదేశములో నేవేవో చేసినారు. ఆ సాక్ష్యబలమున ఇది అంతా ప్రభుత్వముపై కుట్ర అని అర్థమయినది.

‘ఆ కేసులో రామచంద్రునకు సంబంధము లేదు’ అని ఆయన వాదించినాడు.

ముఖ్యమంత్రియు రామచంద్రుడు నిర్దోషియని చాలగట్టిగ చెప్పినాడు. సరేయని ఎట్టకేలకు పోలీసు ముఖ్యాధికారి యొప్పుకొనుచు, కేంద్రప్రభుత్వము వారికి జరిగిన విషయములు, రామచంద్రరావుపై కేసు లేదనియు, మదరాసు ప్రభుత్వము వారును తనతో నేకీభవించుచున్నారనియు మనవి చేయుచు వ్రాసెను.

శ్రీ మదరాసు గవర్నరుగారు ఇన్ స్పెక్టరుజనరలుగా రొనర్చినపని మంచిదని, అట్లు చేయవచ్చుననియు ననుమతినిచ్చిరి.

ప్రభుత్వపు తంతి రామచంద్రుని విడుదలచేయుమని రామనాడుజిల్లా పోలీసు సూపరింటెండెంటుకు పోయినది.

జమీందారు గారు సంతోషముతో ముఖ్యమంత్రికడ నుండియు, పోలీసు ముఖ్యాధికారినుండియు ముఖ్య న్యాయవాదికడ నుండియు సెలవు పుచ్చుకొని, నారాయణరావుకడకు వచ్చెను. వారిరువురు గలసి కూనూరు వెళ్ళిరి. నారాయణరావు అత్తగారికి, భార్య మేనత్తకు నమస్కరించి కేశవచంద్రుని కౌగిలించుకొని మామగారికడ సెలవుపుచ్చుకుని, మధుర ప్రయాణమయ్యెను. తాను వచ్చుచున్నాననియు, విడుదల చేసెదరనియు తన బావ కాతడు మధురకు తంతినంపెను.

ఇటలీలో బ్రిండిజీకడ నాయిటాలి యను మహానౌక నెక్కినప్పటి నుండియు రామచంద్రరాయనికి దన దేశముపై, తన ఇంటిపై, తనబందుగులపై మనస్సు పరుగిడజొచ్చెను.

ఈ దేశములో నెంత యైశ్వర్యమున్న నేమి, ఎన్ని సౌకర్యములున్న నేమి, ఎంత నాగరికతయున్న నేమి తన దేశమున కీడువచ్చునా?