పుట:Narayana Rao Novel.djvu/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



౧౭

పరశురామప్రీతి

ఏమి వీరి ఆనందము! గంజికదా వారి తిండి, గడ్డిగదా వారి పడక, పూరిగుడిసెగదా వారి భవనము. ఆనంద మెక్కడ నున్నదీ? ఇచ్చటా, మనలోనా? పారలౌకికానందము పరమహంసలకు; లౌకికానందమో, ఈ భూమాత శిశువులకేనా! వీరు కవులు, గాయకులు, నర్తకులు. వారు పుట్టినది ప్రకృతి సౌందర్యములో, బ్రతుకునది ప్రకృతి మాధుర్యములో, లయించునది ప్రకృత్యానందములో.

తనబోటివారి నాగరికత, జ్ఞానసముపార్జన ఇవియెల్ల నెందులకు? తన చరిత్ర వారిలో నొక సామాన్యుని చరిత్రతో పోల్చి చూచినచో నపహాస్య భాజనమై కన్పట్టును అనుకొనుచు నారాయణరావు తన స్నేహితులతో నడచుచుండెను.

లక్ష్మీపతి తలయెత్తి ‘వీళ్ళ కవిత్వం ఎంత అందముగా ఉందిరా! ఇదివరకు ఇది వినలేదు. ఒక్కొక్క యుగానికి, ఒక్కొక్కరి కవిత్వము పైకి రావాలిరా! మహారాజులపై కవిత్వము, పై జాతులపై కవిత్వమూ అయింది. ఇక జానపదుల కవిత్వము’ అన్నాడు. ఎవరి భావాలల్లో వాళ్లు ఉన్నారు.

భోజనాలవేళ కింటికి చేరబోవుచు మనవారు ముగ్గురు దొడ్డిదారి వైపు వచ్చుచుండిరి.

సోమయ్య కూతురు, చల్లాలు ఇంటిదగ్గరకు వచ్చిరి. అక్కడ సోమయ్య కొమరుడు సత్తెయ్యయు, చల్లాలు మొగుడు సీతన్నయు హోరాహోరీగా కొట్టుకొనుచుండిరి. ఆడవాళ్ళందరు ఘొల్లుమనుచు వా రిరువురను విడదీయుటకు సర్వవిధముల బ్రయత్నము చేయుచు విఫలులగుచుండిరి.

నారాయణరావు గబగబ రెండడుగులు ముందునకువేసి, బలముగ నిరువురను విడదీసి, యీవలావలకు గెంటివేసెను. అతని కన్నులు విస్ఫులింగ పూరితములై వారిపై దీక్ష్ణములై ప్రసరించినవి. ఆతడు మేఘగర్జనమున,

‘బుద్ధిలేదుట్రా మీకు? వీధిలోని కాట్లకుక్కలా! మిమ్ముల బడిత పట్టుకొని చావకొట్టాలా?’ యనుచు మరియు రౌద్రమూర్తియై సింహ సమానుడై నిలువబడియుండ జూచి పంది, యెనుబోతులులవలె బలిసియున్న ఆ యిరువురు తలలు వాల్చుకొన్నారు.

సోమయ్య భార్య రామానుజమ్మ, ‘బాబూ! రచ్చించండి. ఈళ్లిద్దరూ ఈవాళ ఒకళ్ళ నొకళ్లు కొట్టుకొని చంపేసుకొనే వోళ్లండి బాబూ, మీరు వచ్చారు దేవుళ్లులా’ అని ఘొల్లుమని యేడువదొడంగినది. ‘ఏమిటి కారణం? మాదొడ్డి కప్రతిష్ట తెచ్చారు’ అని నారాయణరావు అడిగెను.