పుట:Narayana Rao Novel.djvu/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

366

నారాయణరావు

‘సీతన్న పెళ్లాన్ని చావగొట్తున్నాడండి. సత్తెయ్యవచ్చి అక్కగారిని ఇడదీసి బావగారితో కలబడ్డాడండి’ అని అక్కడ చేరిన తూర్పుకాపుచిన్నది పలికినది.

‘ఓరే సీతన్నా, వీళ్లందరిదగ్గరా అంటున్నాను. నువ్వు చేసేపని ఎంత ద్రోహమో తెలియునా? ఆడదానిమీద చెయ్యిచేసుకుంటావు? దున్నపోతా! ఛీ! ఛీ! వట్టి నీచుడవు. సోమన్న కల్లుడవా నువ్వు? నీ చరిత్ర అంతా అసహ్యంగా ఉంచుకొని, ఇతరాడవాళ్ళ కాపురాలు చెడగొట్టుతూ పైగా భార్యని కొడ్తావు? బుద్ధి ఉందా? నీ దుష్టబుద్ధులు మానెయ్యి, లేకపోతే నడు ఈఊరు నుంచి. నిన్ను గురించి నాకు ఒక మాట వ్యతిరేకంగా రానీ, నేను స్వయంగావచ్చి నిన్ను ఈ కొత్తపేటలోకి రాకుండా తరిమి వేస్తాను.’ అప్పటికి నారాయణరావు కోపము తగ్గినది. వైష్ణవముద్రలు చురచుర అంటినట్లు సీతన్న కుంగిపోవుట చూచి,

‘ఒరే సీతన్నా! ఫలాని వారిదొడ్డిలో ఉన్నవాళ్లనిపించుకోవాలి. ఇంతటితో నేను మన్నిస్తాను. నా మనస్సు మెత్తన. నేను ఎవరి జోలికి వెళ్లనని తెలుసుకదా నీకు. మా నాన్నగారైతే నిన్ను తోళ్ళు ఊడేటట్టు కొట్టవలసిందేకదా? మా అన్నయ్య తత్ క్షణం వెళ్ళిపొమ్మంటాడుకద. వెనక ఓమాటుచూశాను నీ భార్య కుంగిపోవటం. నీ భార్య అందం ఈ దొడ్డిలో ఎవరికైనా ఉందా? దాని ప్రేమలో మెలుగు, పో!’ అనినాడు.

‘సీతన్న సిగ్గుతో చచ్చిపోయినాడు. ‘అయ్యో చిట్టిబాబయ్యగారికి తెలిసిపోయిందే; తేలునన్నా చంపని ఆ దేవుడికి ఎంతకోపం తెప్పించాను!’ అని మనస్సులో నెంతయు విచారించినాడు.

ఆరాత్రి పడకగదిలోనికి బోయి, చల్లాలు పండుకొనియుండ, పట్టి మంచము దాపున గూర్చుండి యామె పదములనంటి ‘చెమించుపిల్లా! తెలవక చేశా! కలవపువ్వు దగ్గరుంచుకొని, కసింత పువ్వుకోసం పడరానిపాట్లు పడ్డాడంట. ఇక బుద్ధికలిగి ఉంటా, నీ పాదంఆన!’ అని ఆమె పాదాలపై తలవంచినాడు. వెక్కి వెక్కి యేడ్చుచు చల్లాలు కాళ్ళు లాగికొని లేచికూర్చున్న ది. సీతన్న మంచముపై గూర్చుండి యామెను దగ్గరకు లాగికొని ‘చందురుడుంటే చుక్కెందుకు పిల్లా!’ అనుచు అనునయించెను. పశ్చాత్తాపతప్తుడగు భర్త మోము జూచి, నిట్టూర్పునించి, ప్రేమపూరితములగు నాతని బాహులతలలో నామె యిమిడిపోయినది.

రాజారావు వెళ్లిపోయినాడు. వీరభద్రరావువచ్చి యత్తవారింటనే యున్నాడు. రాజారావు తన కారుమీద గాని, సుబ్బారాయుడు గారి కారుమీద గాని వలయునప్పడెల్ల కొత్తపేట వచ్చి సత్యవతిని జూచి వెళ్లుచుండెదనని చెప్పి మందుల విషయమై చేయవలసినదంతయు చెప్పి మందులిచ్చి వెళ్ళిపోయినాడు, వీరభద్రరావునకును, అతడు మందులు తెప్పించి యిచ్చుచున్నాడు.