పుట:Narayana Rao Novel.djvu/368

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
367
పరశురామప్రీతి

ఆ యేడు గాడ్పులు విపరీతముగ వీచుచున్నవి. కాన సామర్లకోటనుండి తెప్పించిన వట్టివేళ్ల తడికల గట్టించి నారాయణరావు తన యిల్లంతయు హిమగిరివలె నొనరించెను. రాజమహేంద్రవరముకన్న కొత్తపేట చాల చల్లగా నున్నది. జమీందారుగారు, వారి భార్యయు, కొమరుడును నీలగిరికి వెళ్ళినారు. శారద యత్తవారింటనే యున్నది.

ఆమె కొత్తపేట వచ్చినప్పటినుండియు భర్తకు కాళ్ళు కడుగుకొనుటకు నీ రొసగసాగెను. నాగరత్నంతో ‘తాళంచెవులు పట్టుకురా నాగరత్నం’ అంటే సూరీడు గ్రహించి చిరునవ్వుతో ‘నాగరత్నం, చిన్నమామయ్యవే!’ అన్నది. ‘నాకు తెలవదా యేమిటి పిన్నీ!’ అని నాగరత్నం సుడిగాలిలా మాయమై నారాయణరావు బట్టలబీరువా తాళములు, ‘చిన్నత్తయ్య యిమ్మంటున్న’ దని తీసికొనివచ్చినది.

నారాయణరావు కాళ్ళు కడుగుకొని లోనికి వచ్చునప్పటికి పట్టుబట్టలు పట్టుకొని నాగరత్నం నిలిచియుండెను.

‘నాగరత్నం! చిన్నత్తయ్య బీరువాతీసి నీకిచ్చిందా ఏమిటే?’ యని ప్రశ్నించినాడు. నాగరత్నం అవునన్నది.

ఆ మరునాడు మధ్యాహ్నం కొత్తపేటలో యిళ్లంటుకొన్నవి. తనయింటి కడ నిప్పు నార్పు వాయుపదార్థ మొకటి యన్న గొట్టము పట్టించుకొని లక్ష్మీపతియు, వీరభద్రరావును గూడరా, నారాయణరావు అంటుకున్న ఇళ్ళవైపునకు బరుగెత్తెను.

జనముల కేకలు వేసి, నీళ్ళబిందెలను బట్టుకరండని అందరిని, కడవలు పట్టుకురండని కొందరిని పురమాయించి, యిళ్లనెక్కు వారిని యిళ్ళనెక్కించి, విప్పించి వేయుచు, అప్పుడే అంటుకొన్న యిళ్ళలోకి దాను జొరబడుచు, సామాను దీయుచు, యువకుల నాపనికి నియోగించుచు నారాయణరావు ఆగ్నేయాస్త్రమునకు వారుణాస్త్రమైనాడు.

గాలవేయుచున్నందున నూరంతయు దగులబడిపోవలసినదే. నారాయణరావు కట్టుదిట్టములచే కొలదియిండ్లుమాత్రమే తగులబడి యారిపోయినవి.

అందులో బెద్దకాపుగారి తాటాకుల నాలుగిళ్ళభవంతి యున్నది. ఆతడు భాగ్యవంతుడు. ధనము, సామాను, బట్టలు, పెట్టెలు మున్నగువానిని చాల వరకు నారాయణరావు మొదలగువారు యీవల బడవైచి రక్షించిరి. ఇంతలో బెద్దకాపు వెఱ్ఱియెత్తిన వానివలె నేడ్చుచు ‘చిన్నబాబయ్య గారు, నా కొంప కూలిపోయింది. భోషాణం పట్టుకురాలేదు. బాబూ నా నోటులు, భూమి తనఖాపత్రాలు, క్రయములు అన్నీ అందులో ఉన్నాయి. ఇంక నాపని అయిపోయిందండయ్యో’ అని ఏడ్చుచు కూలబడిపోయినాడు.