పుట:Narayana Rao Novel.djvu/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మహత్య

343

‘ఇంతకూ ఆవిడ పుష్పం అయినందుకు నాకు మనస్సులో ఈర్ష్య పుట్టింది. కాదనుకొని ఎంత సమాధానం చెప్పుకొన్నా లాభం లేకపోయింది. నామతం మా మతానికి విరుద్ధం అయింది. మా ఆశయాలు గంగలో కలిసినవి.

‘అయితే అయింది. నువ్వు చెప్పినబోధ అంతా ఆలోచించి చూశా. ఎక్కడా సమాధానం కుదరదు. కాని అవునేమో అన్న అనుమానం పట్టుకుంది. అనుమానాన్ని దూరంగా తోలివేద్దాము అనుకుంటే లాభం లేకపోయింది.

‘ఈర్ష్య ఎక్కువైతే, పుష్పశీలాదేవి నామీద ప్రేమ పూర్తిగా వదలి, ఇంకోళ్ళను ప్రేమించి నాదగ్గర నుంచి వెళ్ళితే, ఈ యీర్ష్య వదలక నన్ను బాధిస్తే ఎల్లాగ?’

అది కాకుండా పుష్పశీలమీద ప్రేమపోదే, ఎంత ప్రయత్నించినా! ఆమె నన్ను విడిచి వెళ్ళిపోతే బ్రతకడం ఎల్లాగు? ఆమె మనస్సు చల్లబడిపోయింది. చల్లగా జారిపోయినది. పోనీ ఎల్లాగో నేను ఆ దేవిని విడిచిఉంటాననుకో. ఉంటే మాత్రం ఈ జన్మకేమిసార్థక్యం? ఇంకో జన్మ ఉందీ? సరే! మళ్ళీ పుట్తాను. అప్పుడైనా ఈ హృదయంలో ఉన్న ఈ తుఫాను, ఈమంట, ఈ అగ్ని పర్వతం చల్లారిపోయి, నాకు నిజము గోచరిస్తుందేమో?

‘లేదు. ఇంతటితో ఈ జీవితం ఆఖరు అయితే అపరిమితానందంతో బ్రతికిన నేను దుఃఖం ఎల్లా భరించనురా!

‘సెలవు. నువ్వూ, పరమేశ్వరుడు, రాజా, ఆలం, సత్యం, రాఘవుడు నన్ను ఎంతో ప్రేమించారు. మీఅందరి దగ్గిరా సెలవు. చాలా ధైర్యంతోనూ, భయం లేకుండాను నా జన్మం ముగిస్తున్నా.

‘ఈ ఉత్తరం అందరికీ చూపించు. మీ అందర్నీ కౌగలిస్తున్నా.

నమస్తే

రాజేశ్వరుడు

‘తా౹౹ క౹౹ మా తల్లిగార్ని వెళ్ళి ఊరార్చు. వృద్ధు! రాజే.’

ఈ ఉత్తరం చదువలేక చదివినది రోహిణీ దేవి. నిశ్శబ్దము.

‘పిరికివాడురా’ అన్నాడు పరమేశ్వరుడు.

నారా: పిరికివాడేమిటి? వాడికి సరియైన మార్గం గోచరించలేదు. నా మాటలు కూడా వాడి చావుకు కారణమయ్యాయా, అని నాకు చాలా దిగులుగా ఉన్నది. ఏమి హృదయం!

రాజా: అదేమిటి నారాయుడూ? వెఱ్ఱిగా మాట్లాడుతున్నావు?

పర: ఏమి చెప్పగలంరా? మనుష్యుని హృదయం ఎప్పడెల్లా వెడుతుందో ?