పుట:Narayana Rao Novel.djvu/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అగాధము

325

ఏమది! ఇట్టి ఘోరపాప మాచరించినాడేమి? అట్లు తా నాచరించుటకు గారణమేమి? ఆమెను బ్రేమించుచున్నాడా? అవును; తన చెల్లెలుగా చూచుకొన్నాడు. తన కైదవచెల్లె లనుకున్నాడు. పెద్దసూరీడనుకొన్నాడు. అంతే! నిర్మల ప్రేమ రక్తసంబంధము లేనప్పుడు కొంచెము వెనుదిరిగినచో కామదోషిత మగునేమో?

తనకు వివాహము కానప్పుడు, ఒకరిద్దరు బాలికలజూచి తాను సంభోగాపేక్ష పొందినాడు. ఆ భావము ముహూర్తమాత్రము. అటువెనుక నా తుచ్ఛ భావము రాలేదు.

సంభోగ భావము తుచ్ఛభావమా! అయినచో ఋషుల కెట్లు సంతతులు గలిగినవి? లోన పుల్కరము కదలించు మోహావేశమున్న గాని సంభోగేచ్ఛ జనింపదే. ఆ యిచ్ఛ పాపమా? అది పాపమైన భార్యయందును అట్టి కోర్కె జనింపగూడదే? కాని యిదేమి యాలోచన! శ్యామసుందరి తన్ను ప్రేమించినట్లే యెరుగడు; తన్ను ముద్దుపెట్టుకొనుట సంపూర్ణముగా పాశ్చాత్యుల సోదరీ భావముననే కాదా! ఈ దేశమున అట్టి ఆచారములు లేకపోయినను ఆమె పెట్టిన ముద్దులలో దీప్తసాంత్వన మున్నది. అగుచో తనకంత వేడి యేల జనించినది? తన కట్టి ఆవేశము కలుగ ఏది కారణము? రాజేశ్వరుని మతము నిజము కాదుగద! ఛీ! అది యెట్లు?

ఆతని మత మింద్రియ సంబంధమైనది. అటువంటి యప్పుడు ఆతని మతము దోషభూయిష్టము. పురుషునిలో విటత్వము గర్భితమైయున్నదా, కర్రలోని నిప్పువలె? ఎప్పుడో యప్పడు ప్రతిమానవుని నుండి యిది బయట కురుకునా? పవిత్రమయిన ప్రేమ ఆనందదాయక మందురే. అదియు ఖేద భూయిష్టమా?

అతడు బాధపడిపోవుచున్నాడు. సముద్ర కెరటములవంక జూచుచున్నను అవి కనబడలేదు. అటు తాను ప్రేమించిన తన భార్య తనకు ప్రేమ నీయదు. ప్రేమనిచ్చుటకు సంసిద్ధయగు నొకయుత్తమాంగన తలంప వీలుకానిది. ఎందుకో, మనుష్యుని జీవితములో నింతభాగ మీ ప్రేమ యాక్రమించుకొనుట? యని యాత డాడిపోసికొన్నాడు.

ఏలాగున ఆమె మోము జూచుట. చూడకపోయిన తాను వట్టి పందయై పోడా! పిరికితనము కాదా అది? ఏది గత్యంతరము? అతని కణత లుబ్బుచునే యున్నవి. రక్తము వేగముగ ప్రవహించుచునే యున్నది. వేడియై, హిమశీతలములైన తన యంగములు పట్టుతప్పిపోయినవి. ఆతని హృదయరోదనము సముద్రఘోషలో మిళితమైనది. సముద్రము ఒడ్డుననే యా యువకుడు నిశ్చేష్టుడై యట్లే పడియున్నాడు. సర్వప్రపంచము ఆతనికి లేనిదై, మాయమైనది.