పుట:Narayana Rao Novel.djvu/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

326

నారాయణరావు

నారాయణరా వెప్పుడు సంభ్రమమున లేచి, నిమిషమున తనకడనుండి మాయమైనాడో, ఆ క్షణములో శ్యామసుందరికి జగత్తు తలక్రిందులైనట్లు మెలకువ వచ్చినది. ఆమె గజగజ వణకిపోయినది. ఆమె ఆలోచించుకొనుటకుగూడ భయపడిపోయినది. ఆమె కప్రయత్నముగ నేత్రాంబువులు దొరలినవి. దడదడ మని యుబికిపోవు గుండియ నామె నణచుకొన హృదయముపై రెండు చేతులు వేసికొని నొక్కికొన్నది. తానిట్టి తెలివితక్కువపనిచేసి, యాతని కలంచిన దేమి? అట్టిది ఎప్పడైన కలనైన తలంచినదా యని వాపోయినది. అంత సమాశ్వసించుకొన్నది. తానింత యబలయైన దేమి? అత డంత కంగారుపడినా డేమి? తానేమి దోష మాచరించినది? కరుణావేశయై యాతని ననునయింప బోయినది. ఇంతలో శీలమున కేమైన భంగము కలిగించినదా? అతనిని కౌగిలించినప్పు డేమియో తీపులు తన్నలమిన ట్లయినది. అతనిని దాను ముద్దుపెట్టు కొన్నది. అదియేల? ఆ ముద్దునీయుట భారత నారీమణులు చేయు పనియా? చంటిబిడ్డను ముద్దుగొన మధురముగా నుండదా? అంతకన్న వేరు రుచి తానాతనికి సమర్పించిన ముద్దులో గోచరింప లేదు. ఎంత గట్టిగ కౌగిలించినాడు! భయపడిన బాలు డటులనే యాలింగనము చేయును.

త్రికరణములచే తాను దోష మాచరించినట్లే తనకు దోచుట లేదు. పురుషునితో స్త్రీ, సంచరించునట్లు చరించినదా? తన స్త్రీత్వమే పోయినది. తాను వైద్యకళాశాలలో నెప్పుడు చేరినదో యప్పుడే స్త్రీత్వమును వదలివేసినది. తన్నిదివర కే పురుషుడు నింత కదలింపలేదు. నారాయణరావు పవిత్రహృదయుడు. అతనిపై పవిత్రమగు ప్రేమ చూపించుచున్నది. ఆ ప్రేమలో నపశ్రుతి యేమున్నది? తన ప్రేమలో దేహానందమున్న నుండవచ్చు గాక. అది తాను దోషభూయిష్టహృదయముతో నాచరింపలేదే. కాని ఆతని హృదయములో నేమున్నదో, ఆతని కౌగిలింతలో గంభీరమధురములు తోచినవి. తన ప్రేమలో నేమున్నదో? ఆ క్షణికములో తా నెవరైనదో ?

అట్టి యుత్తమపురుషు డొక్కసారి తన దేహము గోరిన దాను వెనుదీయవలెనా? అంతమాత్రమున తనలో కళంకము జేరునా? అది ఎట్లు? మహర్షి రుచిగల పదార్థము నొకసారి వాంఛించిన యాతనిలోని పవిత్రత ఎట్లు నశించును?

ఏమో! ఏమో!

తా నాతని పవిత్రత భంగము చేయుటకు కారణమయ్యెనా? అట్లుకాదు. మహాసత్వుడగు నాతడు ప్రేమకై తపించినాడు. తనకు బరమ కరుణ గలిగినది. కరుణలో స్త్రీ ప్రేమ జనించినది. ఇరువు రొక పరమనిమేషమున నేదియో యానందమున నోలలాడినారు. అంతమాత్రమున దోష మేమియు లేదు.