పుట:Narayana Rao Novel.djvu/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అగాధము

323

ఎన్ని యుగములకో శారదకు మెలకువ వచ్చుటయని యెదురు చూచుచున్నాడు. ఇంగ్లీషుకథలో చెప్పిన నిదురసుందరిని మేల్కొలుపగల ముద్దు తన బ్రతుకులో లేదా? తా నా రాజకుమారుడును గాదా యని యాత డనుకొన్నాడు. ఎన్ని సారులో దననిశ్చయమును మరచి యా బాలికను దరి చేర్చుకొని తనలో నైక్యమొనరింపదలచుకొన్నాడు. ఆ బాల వట్టి విగ్రహము వలె చైతన్య రహితమా యన్నట్లున్నది.

ఇట్లు శ్యామసుందరి ఉత్తమ మేధాసంపన్నురాలు. కర్మయోగిని. వైద్యవృత్తిచే రోగి నారాయణసేవ జేయ సంకల్పించినది. వైద్యవృత్తిచే వచ్చు ధనము దేశసేవకై వినియోగించెదని యామె దీక్ష. ఆ బాలిక తన సహోదరి. ఆమె సంగీతము నేర్చుకొన్నది. పరమేశ్వరునికడ పాటలువ్రాయ నేర్చుకొన్నదట. ఏమి పట్టుదల! ఆమె హృదయమెంత సున్నితము. ఎంత ప్రేమమయము. ఆమె వైద్యురాలై యెట్లు మనగలదు? నీవు శస్త్రచికిత్స చేయ గలవా యని తాను ప్రశ్నింప__

‘వజ్రాదపి కఠోరాణి, మృదూని కుసుమాదపి’ యని చదివినది. ఇట్టి యుత్తమాంగనలు దేశమాతకు భూషలుగదా!

ఈ యాలోచనలతో దానును బరమేశ్వరుడు కారునెక్కి శ్యామసుందరీ దేవి యింటి కా రాత్రి వెళ్ళినారు. అప్పుడు శ్యామసుందరి దీక్షగా పరీక్షకై చదువుకొనుచున్నది. మనవారిని చూచి మోము ప్రఫుల్లమైపోవ తన సహజమగు నొయారపు నడకతో వచ్చి డాబామీద నున్న కుర్చీలుసర్ది, రండని వారితో నచ్చట కూర్చున్నది. పరమేశ్వరుడు రోహిణి యేదని యామెను వెదకుచు లోనికి బోయినాడు.

పదియేను నిముషములు వారేమియు మాటలులేక కూర్చుండినారు. ఆమె నలముకొన్న భక్తి యాతని చుట్టివేసినది. ఆమె తలవంచుకొని యేమి యాలోచించుకొనుచున్నదో. సముద్రపవనములు శీతలములై హాయిగ వీచుచున్నవి. తారకలు తమ కాంతిరకముల నెమ్మదిగ పన్నీరు చల్లుచున్నవి.

చటుక్కున నారాయణ రావు తలయెత్తి ‘చెల్లీ! నువ్వు పాటలు రాయుచున్నావని పరమేశ్వరుడు చెప్పాడు. ఒక పాట పాడ్తావా?’

‘అదేమిటన్నా! పరమేశ్వరం అన్న, కొంటె అన్న, ఏమిటి నాపాటలు!’

‘పాడమ్మా! నా దగ్గరకూడానా నీకు సిగ్గు?’

‘పాడుతాను. మరి నువ్వేమీ అనుకోకుండా ఉండాలి. నీవంటివారి దగ్గర పాడుటకు చాలా ధైర్యం ఉండాలి అన్నయ్యా!’

‘నేను కొట్టనుగద!’

‘ఏమో ఎవరికి తెలుసును?’

‘పాడు మరి. శ్రుతివద్దు. నీ కంఠంలోనే ఉంది శ్రుతి.’