పుట:Narayana Rao Novel.djvu/323

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
322
నారాయణరావు

లీలాశుకునకు చింతామణి, క్రైస్తునకు మాగ్డలీను, మీరాబాయికి తాన్ సేను, అనిబిసెంటుకు కృష్ణాజీ. అవునా?’ అనినాడు ఒకనాడు పరమేశ్వరుడు.

‘నువ్వు చెప్పినది చాలాభాగము నిజమే. ఎందుకు నీ కా ఆలోచన కలిగింది?’.

‘నాకూ, రోహిణీబాలకు స్నేహము కలిగినప్పటినుంచీ ఎన్ని పాటలో వ్రాశాను. బొమ్మలుకూడా, చూశావా? ఆమధ్య ఆగాను. మరల నాకు ఎక్కడ లేని శక్తివచ్చినట్లు వేయుట ప్రారంభించాను.’

‘అవును! నేనూ ఆశ్చర్యపడుతూ ఉన్నాను. అదా నువ్వూ, రోహిణీ ఎప్పడూ కలిసి మెలిసి మాట్లాడుకోవడం?’

‘రోహిణీ దేవికి ఈ యేణ్ణర్ధం నుంచి చిత్రలేఖనం బాగా నేర్పుతున్నాను, నీకు చూపించమంటే పూర్తిగా తానువేసిన బొమ్మలు తయారుగానే చూపిస్తానంది. అంటే నేను దిద్దడం తక్కువగా ఉండడం అన్నమాట. నాలుగు బొమ్మలు వేసింది. మొదటి మూడు నేను బాగా దిద్దాను. ఆ బొమ్మలలో నా ప్రజ్ఞే ఎక్కువపా లున్నది. ఇప్పడు వేసింది అంతా ఆమె. నేను ఒక గీతగీసినానో లేదో అన్నీ తనే వేసుకున్నది. బొమ్మలు వేయుటలో మమ్ముల నందరినీ మించేటట్టు ఉన్నదిరా!’

‘దుర్మార్గుడా! నాకు చూపించకుండా నువ్వు ఇన్నాళ్ళు దాచావు?’

‘అరే! నీతో నేను వాళ్ళకి బొమ్మలు వేయటం నేర్పుతున్నానని చెప్పలేదుట్రా?’

‘కాని ఇంత బాగా వేస్తుందని సూచించి ఉంటే నేను చూచి సంతోషించేవాణ్ణి. ఏదీ ఈవాళ సాయంత్రం వాళ్ళయింటికి వెళ్ళి చూద్దాము, శ్యామసుందరి బొమ్మలు వేయలేదు కాబోలు.’

‘వేయలేదుకాని శ్యామసుందరి తెలుగులో కవిత్వం రాయడం మొదలుపెట్టినది. తెలుగు చదువను, వ్రాయను బాగా తెలియకపోయినా వినికిడివల్ల, ఎక్కడినుంచి పట్టుకున్నదో తెలుగునుడి, ఏమి తియ్యగా వ్రాస్తుందిరా! పాటలలోని రహస్య మామెకు బోధించినాను. ఈమధ్య సంస్కృతం బాగా చదువుకుంది. నీ కీ రోజునో రేపో పాడి వినిపిస్తానంది.’

8

అగాధము

నారాయణరాయని జీవితాంతర్గతమగు ప్రేమప్రవాహము మహావేగమున ప్రవహించి మాయమగుచున్నది. విద్యుచ్ఛక్తి రెండు స్వరూపములట. అవి ఒకదాని కొకటి వ్యతిరేకములట. రెండును కలిసిన గాని విద్యుచ్ఛక్తి కాదట. అట్లే మానవుని ప్రేమయు ఎదిరిప్రేమ లేనిచో వ్యర్థమై జీర్ణించిపోవును. ఒకప్పు డా జీవిని మూలమునంట కదల్చివేయును.