పుట:Narayana Rao Novel.djvu/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

నా రా య ణ రా వు

యము చర్చకు వచ్చినను నారాయణరా వక్కడ నున్నచో నతనిని వారు సందేహము లడుగుచుండుటయు, నాతడు నిర్దుష్టముగ వానిని గూర్చి తెలియ జెప్పుటయు గలదు. వాని మేధ న్యాయవాది మందిరములో సామెతయైనది.

ఇది యంతయు నానందరావుగారు గమనించినారు. ఆయన యాశ్చర్యమునకు మేరలేదు. ఎంత గొప్ప న్యాయవాదియైనను దన చుట్టు కోటగోడల కట్టుకొన్న వాని నెవ్వరు చేరగలరు! కావుననే నారాయణరావును తోడి న్యాయవాదులు గౌరవించుట గాంచి యాయన అక్కజపడెను.

నేడు నారాయణరా వింటికి వచ్చుచున్నానని యాయనకు మొదటిసారి హృదయమున జ్ఞానమేర్పడినది. తన మేనమామ కొమరిత శారద మగని యింటిలో నున్నది. ఆమెను దాను, దన భార్యయు వెళ్ళి చూడవలెను. ‘లా’ తప్పనేమియు నెరుగని యాతని మెదడునకు దోచిన దంతియ. ‘లా’ ప్రపంచమావల నేమున్నదో, యేమో?

ప్రకృతి - పురుషులు

రామచంద్రరావు హార్వర్డు విశ్వవిద్యాలయములో 1926 వ జూలైలో బి. ఎస్ సి. ఆనర్సులో ప్రవేశించినాడు. బి. ఎస్ సి. మూడు సంవత్సరముల పరీక్ష. బి. ఎస్ సి. ఆనర్సులో విశ్వవిద్యాలయమున రెండవవాడుగా జయమందెను. బి. ఎస్ సి. ఆనర్సు జయమందిన ఆరునెలలకు ఎమ్. ఎస్ సి. పత్రమును విశ్వవిద్యాలయమువా రిత్తురు. అందులకొక పరీక్షయు జరుగునట. ఆ పరీక్ష వ్యాసములు వ్రాయించి వానిని బరీక్షించుటయట. ఎమ్. ఎస్ సి. పరీక్షకై చాలా పట్టుదలతో జదివి 1929 ఫిబ్రవరి నెలలో నా పరీక్షకయి వ్యాసము వ్రాయుట కారంభించినాడు.

ఈలోన నా మూడేడులు హార్వర్డులోను, మశ్శాచియెట్సు రాష్ట్రప్రభుత్వమువా రేర్పరచిన, విద్యుచ్ఛక్తి విద్యాలయములోగూడ చదువుచుండెను. అమెరికా దేశమున నట్టివీళ్ల నెన్నిటినో విద్యాలయములు కల్పించెను. విద్యుచ్ఛక్తి ప్రపంచములో నా విద్యాలయపుబరీక్ష చాలా గణనీయమైనది. లియొనారాకన్యకయు నటులనే చదువుచున్నది. ఆ విద్యాలయము మహానుభావుడగు ఎడిసను పండితునిచే నిర్మింపబడినది.

రామచంద్రరావు తెలివితేటలు గ్రహించి యా విద్యాలయమువా రాతనికి వలయు సౌకర్యములు సమకూర్చుచుండిరి. ఆ విద్యలో బారంగత్వము నందవలెనన్న నైదేడులు చదువవలెను. బి. ఏ. లెక్కలు గాని, పదార్థవిజ్ఞాన శాస్త్రము గాని చదివిన వారిని మూడవ సంవత్సరపు తరగతిలో జేరనిచ్చెదరు. పరీక్షలో విజయమందిన వారికి డి. ఇ. ఇ. అను బిరుదపత్రము నిచ్చెదరు.