పుట:Narayana Rao Novel.djvu/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెఱ్ఱి తల్లి

301

నిండియుండుట, పరమేశ్వరమూర్తి తన భార్యతో సల్లాపములాడుచు నమిత సంతోషమున బ్రతుకుదారిని నృత్యముచేయుట ఆమె చూచినది. జమీందారుల లోనే భార్యాభర్తలు ప్రేమచే నిండియుందురనుకొను శారదకు, జమీందారుల కుటుంబములలోకన్న నితర కుటుంబములలోనే యెక్కువ ప్రేమ యుండు ననియు, జమీందారుల కుటుంబములలో ప్రేమయే లేదేమో యనియు గోచరించెను.

శారద చెన్నపురి వచ్చిన మరునాడు ఆనందరావుగారును, ఆయన భార్య ప్రమీలాదేవి గారును మోటారుపై నారాయణరావుగారి యింటికివచ్చి శారదను గుశల ప్రశ్న జేసినారు. శారదకు ప్రాణము లేచివచ్చినది. ప్రమీలాదేవి నామె బిగ్గ కౌగిలించుకొని కన్నుల నీరునించినది. శారదను దగ్గరకు దీసికొని, ‘తల్లీ! నీ తండ్రిగారు చేసిన యీ దోషానికి నువ్వు అనుభవించవలసినదే’ యన్నది.

చటుక్కున శారదమనస్సులో ‘ఏమి యనుభవించుచున్నాను’ అను ప్రశ్న స్పష్టమై పొడసూప ‘అనుభవ మేమిటి’ అని మందహాసమున బలికినది.

నారాయణరావు పెళ్ళియైన వెనుక నీ రెండు సంవత్సరములనుండియు నొక్కసారియైన ఆనందరావుగారి ఇంటికి భోజనమునకు వెడలలేదు. తెలుగు వారలలో బాగుగ ధనము వచ్చు న్యాయవాదులలో నానందరావుగారు ప్రథములు. అయినను నారాయణరావును దన కచ్చేరీకి రమ్మనిగాని, భోజనమునకు రమ్మనిగాని అతడు పిలువలేదు. నారాయణరా వాయనకు గర్వమని గ్రహించినాడు. కీలుపాకులో మామగారియింటనున్నప్పుడు జమీందారుగారువచ్చినప్పుడెల్ల ఆనందరావుగారు నారాయణుని కలిసికొనుచునే యుండిరి. మేనమామను భోజనమునకు రమ్మని పిలిచినాడు గాని నారాయణుని పిలువలేదు.

జమీందారుగా రల్లునిగూడ తన మేనల్లుడు పిలుచున్నాడనే నమ్మిరి. నారాయణరా వానందరావుగారి యుదంత మిసుమంతయు మామగారికి తెలియనీయక చరించెను.

నారాయణరావు చెన్నపురికి కాపురమువచ్చినప్పుడును ఆనందరావుగారు నారాయణరావుగారి యింటికి రాలేదు. హైకోర్టులో న్యాయవాదుల సంఘ మందిరములో గలిసికొన్నప్పుడును నారాయణరావు నాతడు పల్కరించువాడు కాడు. చెన్నపురి యాంధ్ర న్యాయవాదులు, తమిళ, కన్నడ, మళయాళ న్యాయవాదులలో బెద్దవారుకూడ అతడు లక్ష్మీసుందర ప్రసాదరావుగారి యల్లుడనియు, బి. ఎల్. పరీక్షలో ప్రథముడుగా గృతార్థుడైన యువకుడనియు, భాగ్యవంతుడనియు, దెలివిగల బాలుడనియు, భారతి మున్నగు తెలుగు పత్రికలలో, త్రివేణి మొదలగు ఇంగ్లీషు మాసపత్రికలలో వ్యాసముల వ్రాయుచుండుననియు, సంగీతమున నిధియనియు, బొమ్మలు అద్భుతముగ జిత్రించుననియు దెలియగనే వారంద రాతనితో స్నేహము చేసినారు. న్యాయవాదులసంఘములో నేవిష