పుట:Narayana Rao Novel.djvu/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇష్టాగోష్ఠి

291

ధనం చిక్కువచ్చిన రోజుల్లో శిస్తుతగ్గించి పుచ్చుకోరేమి? జమీందారు రైతులకు తండ్రి. కాని తన తండ్రిత్వము తిండిత్వములోకి దింపాడు.

రోహి: కొందరు జమీందారులు రైతులంటే పడిచచ్చిపోతారు, వాళ్ళబాగే తమ బాగని చూచుకుంటున్నారు. మాతండ్రిగారి స్నేహితుడొక డున్నాడు అలాంటి ఆయన.

పర: నారాయణరావు మామగారో? ఆయన జమీ చూస్తే ముచ్చటైపోయినది. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి యేబది వేలిచ్చారు. పంటపండని రైతును బాధపెట్టరు. సర్వేలు చేయించుకున్నారు. ఎప్పటికప్పుడు రైతులకు__ రైతువారీ రైతులకు ప్రభుత్వంవా రిచ్చినట్లు పట్టాలు యిచ్చారు. జమీందారీ ఉద్యోగులు లంచాలు తినకుండా నారాయణరావు మామగారు స్వయముగా ప్రజలను తనిఖీచేస్తూ ఉంటారు. ఆయనకు చేతులెత్తి మొక్కని రైతు లేడు.

శ్యామ: అవును విన్నాము. అన్నా, నారాయణరావూ! మా చిన్న వదినను ఎప్పుడూ చూపించుట? చాలా అందమైన బాలిక అని ఈ అన్నయ్య చెప్పినాడు.

పర: రేపు క్రిస్టమసుపండుగ వెళ్ళిన తర్వాత ఇక్కడికి కాపురానికి తీసుకొని వస్తున్నాడు.

రోహి: ఏమిటన్నా చెప్పావుకావు!

నారా: చెప్పుదామనుకున్నాను. సరి, పరమం చేప్పేశాడు.

ఇంతలో మంగపతిరా వచ్చటకు వచ్చినాడు. మంగపతిరావు నారాయణరావును చూచి చిరునవ్వు నవ్విలోనికి బోయినాడు.

మంగపతిరావు గాంధీగారి అహింసావ్రతము ఆడుదాని మతమని వాదించును. శక్తి హీనులమగు మనం ఈ అహింసావ్రతంలో బడి మరింత శక్తి పోగొట్టుకొని నశించిపోవుదుమని యా బాలుని వాదన. ఏమి తెలియని కుఱ్ఱవాళ్ళు, ‘సరియైన దారి చూపండి నడుస్తాం. బాంబులు తయారుచేస్తాం. రివాల్వరులు గురిచూస్తాం. యుద్ధం చేసి రాజ్యం సంపాదిస్తాం’ అని వాదించారు.

‘ఈ కుఱ్ఱవాండ్రు సరియైనమార్గం లేక తప్పుదారిని పడుతున్నారు. మీరటు కుట్రకేసు చూస్తూన్నాం కాదూ? శ్రీ మహాత్ముని తత్త్వం వీళ్ళకేమి తెలుసును చెల్లీ! ఈతని మనస్సు నెమ్మదిగా మార్చి వేయాలి. లేకపోతే ఓ రాత్రివేళ యెక్కడికో పారిపోతాడు. చివరకు ఉరికంబ మెక్కుటకు సిద్ధం అయిన తర్వాత ఎవళ్ళమూ ఏమీ చెయ్యలేము’ అన్నాడు నారాయణరావు.

అతడు తనయింటికి బోయి బోల్షివిజము ప్రత్యక్షము చేసిన మహాచిత్రకారుని చిత్ర మొండు తన చిత్రసంపుటినుండి తీసి చూచినాడు.