పుట:Narayana Rao Novel.djvu/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పు న స్సం ధా న ము

199

అప్పుడు వాలుజూపులతో నారాయణరావు భార్యను జూచినాడు. ఉన్మి.................గు నామె వివిధాంగములు స్ఫుటత్వము దాల్చుచుండ వసంతమునాటి మల్లికాలతవలె మిలమిలలాడినది. ఆమె కన్నులు నిశ్చల నిర్మల యామినీతారకలవోలె మెఱిసినవి. ఆమె చెక్కులలో నుషస్సుందరీ హాసములు ప్రసరించిపోయినవి. ఆమె బంగారు దేహము మేల్మియెక్కి పాలసంద్రాన సంధ్యారుణహేమము లలమినట్లయినది. నిత్యౌపాసనాగ్నిని ఆ దంపతులు జరిపిరి.

ఆమె నడకలో నొక యొయారము, చూపుల కొక వెన్నెల, శరీరమున కొక దీప్తి, యాలోచనలకొక యనంతనీలత్వము, ఆమెలోనే యొక దివ్యశ్రుతి ప్రత్యక్షమైనవి యని నారాయణరావు ప్రణయయోగమున గన్నులు మూసి ధ్యానించెను. మనసులో నామెను కౌగలించుకొన్నాడు. ఆమె తన ప్రాణములోని ప్రాణము, ఆత్మలోనియాత్మ యనుకొన్నాడు.

తనచేతిలో నామె యుదకము పోసినప్పు డామె యంగుళులు చంద్రకిరణములై యాతనికి దోచినవి.

పురోహితు డేమేమి తంతు చేయించెనో, యెప్పుడు మామగారు తనకు స్వయముగను తన భార్యకు నత్తగారిచేతను శుభవస్త్రముల నిప్పించెనో, ఎట్లు తానా శుభవస్త్రముల ధరించెనో, యేవిధమున నాశీర్వచనముచేసిరో, హారతు లెత్తిరో యవి యన్నియు నారాయణరావు గమనించలేదు.

పీటల పైనుండి లేచినపిమ్మట నారాయణరావుతో పరమేశ్వరుడు, ‘ఒరే నారాయణా! నీ మోము దివ్యమై కనిపించిందిరా, ఇందాక పీటలమీద. ఏమిటి ఆలోచిస్తున్నావు? మీ రిద్దరూ కూర్చునిఉంటే, ఇంతకన్న పరమోత్కృష్టమైన దాంపత్యము ఎక్కడనైనా దొరుకుతుందా అనుకున్నా, ‘అనిరుద్ధుడూ, ఉషాబాలలా కనబడ్డారురా మీరిద్దరూ!’ అన్నాడు.

‘ఓహో, మొదలెట్టావు, మాగధస్తుతి?’

‘అరే పోవోయి స్తుతి యేమిటీ? నీ భార్యలాంటి అందమైనపిల్ల, నీవంటి మారసుందరుడు ఉన్నారట్రా! మీరిద్దరూ సినిమాలో చేరి ప్రపంచానికి ఆదర్శరంగనక్షత్రా లెందుకు అవరాదూ?’

‘డగ్లాసు ఫైర్‌బాంక్సు, మేరీ ఫీక్‌ఫోర్డు లంటావా మేము?’

‘ఆ అదే!’

‘మన దేశంలోని నవీన తారలతో పోల్చావుకాదు నీ పుణ్యమా?’ అని లక్ష్మీపతి అందుకొని, ‘మనదేశంలో నాటకాలు ఎందుకూ పనికిరాకుండా తయారవుతున్నాయి, నానాటికి’ అన్నాడు.

నారా: పరమేశ్వరుడు చక్కనిపిల్లలా ఉండేవాడు. ఎప్పుడూ ఆడ వేషమే వేస్తూ ఉండేవాడు.