పుట:Narayana Rao Novel.djvu/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడవాళ్ళ బ్రతుకు అథోగతి బ్రతుకు

187

రింపవలయునంతటి సుశీల. కఱ్ఱతో మోది కుక్కనువలె భర్త కొట్టుచుండినపుడు కిక్కురుమనదు. ‘రామ! రామ! రామ!’ యని మాత్రమనుకొనుచు, నశ్రుధారలు తుడుచుకొనుచుండును.

సత్యవతి కొమరిత బంగారుబొమ్మ. తల్లి నోటిలో నుండి యూడిపడినది. తండ్రి తల్లిని గొట్టునపుడు విరగబడి యేడ్చును. ఒకనాడు ‘నాన్నా నాన్నా! అమ్మను చంపెయ్య రక్తము వస్తూంది’ అని అడ్డంపడితే ఆమెను కూడ చావగొట్టినా డా కర్కోటకుడు.

జానకమ్మగారి పేర సత్యవతికూతురు నాగరత్నం ఉత్తరం వ్రాసినది. ‘అమ్మమ్మా, ఈరోజు అమ్మను కొట్టిన దెబ్బలకి అమ్మ మూర్ఛపోయింది. రెండుగంటలు తెలివిరాలేదు. నాన్న డాక్టరుకోసం వెళ్లగానే ఈ ఉత్తరం మీకు రాయమని మా యింట్లోనేకాపురంవున్న విజయలక్ష్మమ్మత్త యీ కార్డు యిచ్చింది. నీకు ఉత్తరం రాశాను, వాళ్ళే పోస్టులో వేశారు. ఈమధ్య నాన్నకు కోపం ఎక్కువైంది. తప్పులు క్షమించవలెను. చిత్తగించవలెను. -----మనుమరాలు, నాగరత్నం.’

ఈ యుత్తరము చూచుటతోడనే జానకమ్మగారు కళ్లనీళ్ళు క్రుక్కికొనుచు వాపోవజొచ్చెను. సుబ్బారాయుడుగారు చిన్నబోయి మనసున కుములుచున్న కోపమున, నేమి చేయవలెనో యాలోచన తేలక కూరుచున్నారు. తన చిన్నతనములో నిట్టివ్యాపారము తనచెల్లెలికి జరిగియుండినచో దానేమి చేసి యుండును? వానిని బోయి తొక్కి పాతర వేసి, తన చెల్లెలి నింటికి తీసికొని వచ్చియుండునా? అయ్యో, అది తప్పు. స్త్రీ, పతివ్రత; పతిభక్తి పరాయణ. భర్త చంపినను సరే, భరించవలయును. తాను దుర్మార్గుడైనచో తన బావమరది తన్ను హతమార్చుటకు దా నొప్పుకొనునా? ఏది ఎట్లయినను దన బాలికగతి యంతియ. వెళ్ళి తీసికొనివచ్చి తన యింటిదగ్గర నుంచుకొనిన లోకము హర్షించునా? పోనీ, లోకముకొరకు వెరువక తీసికొనివచ్చి పంపించక యూరకుండినచో? తన ముద్దులబిడ్డ బ్రతు కథోగతియేకదా. ఏది ఎట్లయినను తనకుమార్తె యనుభవించవలసినదే! అని యూహాలోకమున బడి సుబ్బారాయుడుగా రుస్సురని కూర్చుండిపోయిరి.

రాధాకృష్ణయ్యగా రది విని ‘ఏమిరా సుబ్బారాయుడు! మా పినతల్లిని ఆవిడ మొగుడు యిలాగే వేపుకుతింటుంటే రెండుసార్లు కాపురానికి వెళ్లిన రెండు సంవత్సరాలలో నూతిలో బడిందట. రెండుసార్లూ ఎవరో బతికించారటరా అబ్బాయి! ఆ తర్వాత మొగుడుమీద తిరగబడి మహాశక్తి దేవతై వెధవన్నని పిల్లిలా చేసిందట. అల్లాగే నువ్వు చేసేదేముంది? నేను చేసేదేముంది? భార్యాభర్తలకు దెబ్బలాటవస్తే వాళ్ళే సముదాయించుకోవాలి’ యనెను.

నారాయణరా వీ సంగతివిని, తండ్రిగారితో చెప్పి, పెద్దాపురం వెళ్ళినాడు. తన చిన్నక్కగారు మొన్ననే పండుగకువచ్చి, పెద్దాపురం వెళ్లినది.