పుట:Narayana Rao Novel.djvu/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

నా రా య ణ రా వు

ఇంతలో నేమి మునిగినదో! ఆడవాళ్లను గష్టపెట్టు పరమ దౌర్భాగ్యులు, చదువుకొన్న పశువులు నున్నారు. వారికి శిక్ష యెటులో భగవంతుడు ఎరుగడు కాబోలు.

మధ్యాహ్నము రెండుగంటలకు నారాయణరావు పెద్దాపురం చేరుకున్నాడు. ఇంటిదగ్గర బావగారు లేరు. తన చిన్నక్కగారు, మేనకోడలు నాగరత్నము నున్నారు. ‘చిన్న మామయ్యా! నిన్నే వచ్చింది మెలుకువ అమ్మకు. ఆ కట్టుకట్టిందే, అమ్మకు తల పగిలిపోయింది. ఉగ్రుడైపోయి చేతిబెత్తంతో కొట్టాడు. మామయ్యా! నన్నూ కొట్టాడు మా నాన్న’ అని నాగరత్న మన్నది.

‘ఒరే తమ్ముడూ! నా కర్మానికి మీరంతా ఇదిఅవుతే ఏం లాభం! ఈ తెలివతక్కువ మొద్దు మీకు ఉత్తరం రాయడం ఎందుకు చెప్పు? అమ్మకీ, నాన్నకీ, మాకూ గుండెలు తరుక్కుపోవడం తప్ప ఏం లాభం ఉందీ?

‘ఎందుకు కొట్టాడే చిన్నక్కయ్యా?’

‘ఎందుకైతే ఏమిరా బాబూ! నేను పూర్వజన్మలో చేసుకొన్న పాపం నన్ను ఇల్లా బాధిస్తూంది. ఏదో కారణం. ఆయన మంచివారే. ఊళ్ళోవాళ్ళందరికీ మంచే. అందుకనే ఆయన కొట్టిన సంగతి ఊళ్ళోవాళ్లకి తెలియగానే నావల్లే తప్పుందనీ, నీ బావగారివల్ల తప్పేమీ లేదనీ ఈ చుట్టుప్రక్కల వాళ్లు కొందరు అనుకున్నారు. నన్ను గురించి మీ రనుకొనేది తప్పు అని వాళ్లతో నేను చెప్పగలనురా! నా కర్మం.’

‘అమ్మని పెద్దమామయ్య తీసుకువచ్చి దిగబెట్టగానే, అమ్మని ఏదో అని, నాన్న కోప్పడ్డాడు మామయ్యా! అప్పణ్ణుంచి ఏదో ఒక కోపమే?’

‘అయితే నిన్ను అంత చావగొట్టడానికి కారణం ఏమిటే?’

‘ఏవుంది, పండుగకు వెళ్ళి ప్రతిమగవాణ్ణి చూశానట. ఇంకా ఏమో ఏమో అన్నారు. జవాబుచెప్పను నాయనా! చెపితే అప్పుడే ప్రాణాలు వదులుకోవాలి.’

‘అదా! సరేలే!’

‘నా తోడు! ఒట్టు! ఒరే తమ్ముడూ! ఏమన్నా తొందరపడతావేమో సుమా! నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను!’

‘ఒసే అక్కయ్యా! నీ మొగుడు పశువు కాని మేమంతా పశువులు కాము. జన్మం ఎత్తినందుకు జ్ఞానం కలిగిన మనుష్యులుగా సంచరించాలి. ద్విపాద పశువైపోవాలా! ఛీ! వెధవజన్మలు. కుక్క నయం. పందినయం. పెళ్ళాన్ని చావగొట్టి ఆమెచస్తే, మళ్ళీ పెళ్లి చేసుకొని, కొత్తగావచ్చిన పెళ్లానికి అడుగులకు మడుగులొత్తుతారు మగ సన్యాసులు, పురుగుజన్మ లక్కయ్యా.’

‘ఒరే బాబూ నీకు కోపం వస్తూంది. నువ్వు బలంకలవాడవు. చేయి చేసుకొని నన్నథోగతిపాలు చెయ్యకు. నా కర్మం నేను అనుభవిస్తాను గాని, నువ్వు ఇంటికి వెళ్ళిపో.’