పుట:Narayana Rao Novel.djvu/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

నా రా య ణ రా వు

దేశమోక్షమునకై సహాయ నిరాకరణోద్యమము మొదలుపెట్టిరి. బ్రాహ్మణేతర నాయకులు ప్రభుత్వపక్షము జేరిరి. మాంటేగు చెమ్సుఫర్డు రాజ్యవిధానము వచ్చుటతోడనే శాసనసభలో నెన్నుకొన్న సభ్యులలో నుండి మంత్రుల నియమించవలసివచ్చినది. బ్రాహ్మణేతర నాయకులు తమ్ము మంత్రుల జేయవలయు ననియు లేనిచో మహాత్మాగాంధిగారి యుద్యమమునందు జేరెదమనియు బెదరించిరట. అప్పుడు వెల్లింగ్టన్ ప్రభువు పానగల్లురాజాను ముఖ్యమంత్రిగా, వెంకటరెడ్డినాయుడు, పరుశురాము పాత్రోల నుపమంత్రులుగా నియమించెను.

మహాత్మాగాంధీ బార్డోలీలో సత్యాగ్రహోద్యమమును చౌరీచౌరా దౌర్జన్యము కారణముగా మానివేసినయపుడు దేశబంధుదాసు, పండిత నెహ్రూ గారలు స్వరాజ్యపార్టీ నేర్పాటుజేయ దేశమంతట నాపార్టీ వ్యాపించి శాసనసభలలో బ్రవేశించెను. కాని నిరాకరణవాదులే భరతదేశమున నెక్కువగా నుండుటచే స్వరాజ్యపార్టీ వారొక్క నాగపురములోను, బెంగాలులోను మాత్రము శక్తిసంపన్నులు కాగలిగిరి. చెన్నరాజధానిలోగూడ నా పార్టీ విజృంభించు చిహ్నములున్నవి. వారు ముఖ్యపక్షముగా మదరాసు శాసనసభలో ప్రభుత్వమువారి నెదుర్కొనుచుండిరి. జాతీయవాదులనువారు కొందరొక చిన్నపార్టీ గట్టి స్వరాజ్యపార్టీ వెనుక మద్దత్తుగా నుండిరి. అట్టి జాతీయ పక్షమునకు మన జమీందారుగారు నాయకుడు.

ఆరోజు సభలో జమీందారుగారు కృష్ణా గోదావరిజిల్లాలలో రైతుల కష్టములగూర్చి పెక్కు ప్రశ్నలడిగిరి. స్వామి వెంకటాచలసెట్టి మొదలగువారు మన జమీందారుగారికి బలము గలుగచేసిరి. అరగంటవరకు ప్రభుత్వమువారు ముళ్ళపై నడిచినట్లయినది.

ఇంతలో జమీందారుగారు నాంధ్రజిల్లాలను ప్రత్యేక రాష్ట్రముగా విడ దీయవలయునను తీర్మాన ముపపాదించిరి.

‘అయ్యా అగ్రసనాధిపా! నేనీ యుపపాదన చేయుట రెండవసారి. అప్పుడప్ప డాంధ్రనాయకు లనేకు లీ యుద్యమము నీ సభలో ప్రకటించియే యున్నారు. ఆంధ్రోద్యమ మిప్పటికి బదిపదేను సంవత్సరముల నుండియు దేశమున వ్యాపించి ఆంధ్రులనుత్సాహశీలుర నొనర్చుచున్నది. అఖిల భారత జాతీయ మహా సభవారు దాని నామోదించి యా ప్రకారము వారి సంఘముల యేర్పాటుతో ఆంధ్రరాష్ట్రమును ప్రత్యేకముగా విభజించిరి.’

‘ఆంధ్రరాష్ట్రము చెన్నరాజధానిలో కొంచె మెచ్చుతగ్గుగా సగమున్నది. పదునొకండు తెలుగుజిల్లాలు, నేజన్సీయు నున్నవి. రెండుకోట్ల పైచిల్లర జనమున్నారు. రాష్ట్రాదాయము సగము తెలుగుజిల్లాల నుండి వచ్చుచున్నది. ఆంధ్రదేశము అస్సాముకన్న, మధ్య రాష్ట్రముకన్న, పంజాబుకన్న పెద్దరాష్ట్రము. ఇప్పుడే చెన్నరాష్ట్రీయ పరిపాలనము రెండు రాష్ట్రపరిపాలనములవలె జరుగుచున్నది. పోలీసు, ఎక్సయిజు, రెవిన్యూ, విద్య, డి.పి.డబ్ల్యు, అటవి,