పుట:Narayana Rao Novel.djvu/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శా స న స భ

155

గృహములు మొదలగు నన్నిశాఖలపై రాష్ట్రాధికారులున్నను, రాష్ట్రాధికారులకు జిల్లాయధికారులకు మధ్య రాష్ట్రాధికారులతో సమానులను నిరువురు మువ్వు రధికారు లుండియున్నారు. అఖిల భారతీయ ప్రభుత్వ సంబంధమగు పోస్టలు, తంతులు, రాబడి ఆదాయము, ఉప్పుపన్ను మొదలగు శాఖలును రెండు రాష్ట్రముల కేర్పరచినట్లే రాష్ట్రమున రాష్ట్రాధికారి చేతిక్రింద నిరువురు మువ్వు రధికారుల నేర్పరచినారు.

‘న్యాయస్థానముల విషయములో మదరాసు ఉన్నత న్యాయస్థానమున సరిగా పని జరుపవలెనన్న నిప్పుడున్న న్యాయాధికారులకు రెట్టింపుమంది నింకను నేర్పరుపవలయును. ఒక్కొక్క వ్యాజ్యము పరిష్కరింపబడవలె నన్న పెక్కు సంవత్సరములు పట్టుచున్నది. అట్టియప్పుడు రెండు ఉన్నత న్యాయస్థానముల నేర్పరుపవచ్చును. నేను వేసి చూపించిన లెక్కల ప్రకారము రెండు రాష్ట్రములు చేసినచో ఖర్చెక్కువ యేమాత్రము కాదు.

‘కలిసియుండుటచే నుద్యోగములకని, సౌకర్యములకని ఆంధ్రులను తమిళసోదరు లణగద్రొక్కి వేయుచున్నారని గోల యెక్కుడగుచున్నది. ఈ రెండుజాతులును విడిపోయినచో నిరువురు నపరిమిత స్నేహముతో సౌహార్ద్రముతో నుండుటకు వీలున్నది.’

ఈ విధముగా జమీందారుగా రొకగంటన్నర మాట్లాడినారు. కొందరిటు కొందరటు మాట్లాడినపిమ్మట కాలముదాటిపోవుటచే ఓట్లుగైకొనుట ఆగిపోయినది.

మధ్య ఫలహారములకు లేచునప్పుడు జమీందారుగారు, శాసనసభా ఫలహారశాలనుండి యుపాహారములు దెప్పింప తన యల్లుని, నాతనితో వచ్చిన ముగ్గురు స్నేహితులను బిలిచి విందొనర్చెను. తన స్నేహితుల కనేకుల కల్లుని, యాతని స్నేహితులను బరిచయ మొనరించెను. వారందరు రెండు కారులలో వారి గృహములకు వెడలిపోవుచుండ ఆంధ్రపత్రిక తరఫున శాసనసభా కార్యక్రమము బత్రికకు నివేదింప వచ్చిన పరమేశ్వరునితో జమీందారుగా రిట్లనిరి :

‘చూశారూ, పరమేశ్వరమూర్తి గారూ! ఇల్లాగ ఉంటుంది. మా అకాండతాండవం. ప్రభుత్వము వారు సూత్రధారులై తమ యిచ్చవచ్చినట్లు మమ్ము కీలుబొమ్మలను జేసి ఆడిస్తూ తమ పబ్బం గడుపుకొనిపోతూవుంటారు, మా అంతట మే మొక్క వ్యాపారంకూడా చేయలేము. ఎన్నిక సభ్యులు ప్రభుత్వపక్షము వారికన్న అధికంగా వున్నారనుకొందాం. మావారొక విషయము శాసనము చేయించాలనుకుంటే గవర్నరు, వైసురాయిగారల అనుమతి కావాలి. తర్వాత దేశంఅంతా ప్రచురణము చెయ్యాలి; తర్వాత ప్రత్యేక సంఘంవా రా విషయం తర్జనభర్జన చేసి నివేదిక తయారుచేస్తే, దానికి శాసనసభలో ఎక్కువమంది ఒప్పుకొని నడిపిస్తే గవర్నరుగారు, గవర్నరుజనరలుగారు