పుట:Narayana Rao Novel.djvu/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

నా రా య ణ రావు

‘ఆ పట్టణానికి పరుగుదూరంలో పెద్ద మాలపల్లి! ఆ పల్లెలో రెండు వందల గుడిసెలు, ఓదాని పైన ఓటెక్కి, ఉక్కిరి బిక్కిరిగా ఉన్నాయా.’

‘ఆఁ....!’

‘ఓ మాలపల్లి పెద్దమాలోడు! ఆడు పూర్వం రాజులనుంచీ ఆరికి కాపలా కాసుకుంటూ సాకిరీ చేసుకుంటూ, నమ్మకంగా పెబువువోరి మణుసొచ్చిన బంటై ఉన్నాడా.’

‘ఆఁ...!’

‘ఓ రా పెద్దమాల యెంకటిదాసుకు భూమి, బుట్ర, పశువులు, పెంకుటిల్లు, సిరి సంపద యేసీ యెయకుండా ఉన్నా ఓడు ఎఱ్ఱబణాతుగోచెట్టి, ఎండి పొన్నుకర్ర సేతబట్టి, యీదెంట యెల్తావుంటే యెలాగుండేది! అతగాడికి మాబగితి, పొద్దత్తమానం బజినేలు, సదువుకోడం, పాడుకోడమున్నూ. అతగాడికి దైభముగొంతెమ్మల్లాగో, పాండవులోరిలాగో కిట్టమూతిలాగో కనబడే వోడంట. అతగాడిమాట నిజమైపోవాల. అతగాడు యిగిబూతి పెడితే దెయ్యాలు గియ్యాలు పారిపొయ్యేవి. సెయ్యెత్తితే రోగాలు సెదిరిపొయ్యేవి. అమ్మవోరిని పలకరిస్తే ‘వూ’ అంటదంటా...’

‘ఆఁ...!’

‘అతగాడికి ఓకొడుకు, ఆడికి దేముడు దయ్యం గియ్యం బయం లేదు. ఆడికి దెయ్యాలకంటె బలం! రాక్షసుడులాంటిశగితి, బల్లూకం_అంటే ఎలుగుబంటిలాంటి పట్టు! ఆణ్ణిసూత్తే అందరికి బయమంటా!’

‘ఆఁ...!’

‘మరిగంటే ఆడిపేరు మరకడు! మరకడికి ఆడపిల్లలంటే మణుసు. పయిటంటె పక్క లెగరేస్తాడు. రైక అంటే రంకెలేస్తాడు. ఇంతకొప్పెట్టి ఇంత కుంకుమెట్టి, చెవిలో తురాయిపూవు, మెళ్ళో గందం అలంకరించుకొని, చీర ఎనక్కుకట్టి, సంకకింద తట్టెట్టి, సంతలో కోమటాయనతో యేళాకోళాలాడి, కొబ్బరిచిప్పలో కొబ్బరినూనె యేయించి తలకు రాసుకొని, నవ్వుకొంటోయెళ్ళే నల్లపిల్లని సూసినాడంటే ఆడంతే ఆగిపోతాడు. పాణమైన యిచ్చేస్తుడా ...’

‘ఆఁ...!’

‘అయ్యబత్తిమాట తలచడూ, ఆడి మరియాద తలచడూ, ఆ పిల్ల యెనక బడి లంచమిత్తానంటాడూ, రయికలిత్తానంటాడూ, సీరలిత్తానంటాడూ, ముద్దెట్టే నాపిల్లా, నేనందంగా లేనంటే అని మిణకరిస్తాడు, మీసం తిప్ప కొంటాడు.’

‘ఉఁ...!’

‘కాలవరేవుకీ, పొలంలోకి, గడ్డికోతకాడికీ యెళ్ళే పిల్లల్ని చూస్తే, ఆంబోతు ఆవుల్ని చూసినట్లే. ఒంటిపిల్ల యెల్లిందంటే ఆడి మొగతనానికి కొండచిలవకి లేడిలా అయిపోతదే, నక్కపోతుకు కోడిపెట్టలా అయిపోతదే!’