పుట:Narayana Rao Novel.djvu/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొ లం

135

మనస్సు నొవ్వకుండా పువ్వులలోనుంచి కాపాడుకొనుచుండవలయును అని సత్తెయ్యతో జెప్పుచు ‘దీర్ఘాయురారోగ్యాభివృద్ధిరస్తు, దీర్ఘసుమంగళీభవ, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు’ అని దీవించినారు. ‘అమ్మాయీ, అత్తగారికి, మామగారికి, మగనికీ మనస్సు నొవ్వకుండా సంచరించుకుంటూ ఉండు. వారికి సేవచేసి మెప్పుపొందు. ఈ రూపాయలు పెట్టి వీరికి నగలు చేయించి పెట్టరా సత్తెయ్యా! నీ తల్లికడుపు చల్లగా నీ అత్తకడుపు చల్లగా పిల్లల్నీ మనుమల్నీ యెత్తి వేయికాలాలకు మీరంతా చల్లగా ఉండండి’ అని ఆశీర్వదించి జానకమ్మగా రొక చీరెయు రవికెలగుడ్డయు పసుపు కుంకుమ పళ్ళు కొబ్బరిబొండములు పెండ్లిగూతునకు నిచ్చినారు.

మరునాడు సోమయ్య యుదయముననే యూడ్పు పొలముల కలుపు తీయించుటకు వెళ్ళినాడు. బుడమ, కొణామణి, ఆట్రగడా, అక్కుళ్ళు, కృష్ణ కాటుకలు సుబ్బారాయుడుగారి ఇంటిఖర్చుకై పాలాట్రగడము నూడ్చినారు. చేలన్నియు బాగుగా పెరిగినవి. ఇదివరకే యెనుబది ఎకరములకు కలుపు తీయించినారు. తక్కిన యిరువది యకరములలో పదిమంది మాలవాండ్రు నితరులు కలుపు తీయుచుండిరి. సోమయ్య తాటియాకుల గొడుగు వేసికొని గట్టుమీద కూర్చుండి పని చూచుచుండెను.

మాలపెద్ద ముసలినాగడు ‘యీ రోజులలో కుఱ్ఱోళ్లు పని చేయగలరంట్రా! ఆడు సూడు, యెదవనాయాలు. కబుర్లేగాని, పనిలేదు. వంగండఱ్ఱా వంగండి? యని కేక వేసెను.

సోమయ్య: ఒరేయి! పోతుగోయ్! ఏవిట్రా అదీ! కలుపు తెంపుతున్నావా, మేస్తున్నావా? వెదవబద్దకాలా? యేళ్లలోంచి లాగరా! మళ్ళీ పెరగవంట్రా! ఓరే నాగన్నా ఆడిపని సూడరా. సరీగ్గా చెయ్యకపోతే ఈ వాళ కూలి సున్నే. ఆ ఆడపిల్లల్ని చూసి బుద్ధి తెచ్చుకోరా కుంకన్నా, యీ పిరగేస్తాను.

నాగన్న: బాబూ! యీళ్ల పని మజాఅయిపోతోందండా! పెద్దోళ్ళ మాట యింటారా యావన్నానా?

సోమన్న: ఒరే పెద్దమాలా మంచికథ చెప్పరా! అది వింటూ పని సురుగ్గా చేస్తారు. మట్టగిడసల్లా ఉన్నారు. పనంటే తొంగుంటారు.

నాగన్న: మరి రాగంతో సెప్పేత్తాబాబూ! ఆళ్లందరిని కలిసి ఊకొట్టమనండీ!

అందరు: తప్పక, ఆ! ఆ.........! (అని కూనిరాగంతో ఊకోట్టుచుండిరి.)

నాగన్న కథ దీర్ఘంగా చెప్ప నారంభించెను.

‘అనగనగా ఓ దేచంలో ఓపట్టణముందా’