పుట:Narayana Rao Novel.djvu/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

నారాయణరావు

పెట్టి గారడీ చేసి డబ్బు సంపాదిస్తే మాంత్రికుడు, వీధిలో డోలువాయిస్తూ బుట్టలో మనిషిని మాయం చేయిస్తే బిచ్చగాడూనా? నా ఉద్దేశమునకు స్వరాజ్యము వచ్చి దేశం బాగుపడ్డాక ఈ బిచ్చగాళ్లని బాగుచేసి, వాళ్ల కళా సంబంధమైన వృత్తులలోకి ప్రవేశించిన దోషాలు మాయముచేసి, ఆ వృత్తులు వృద్ధిపొందేందుకు కళాశాలలు ఏర్పరచాలని. ఆ ఆశయము నన్ను పులకరాలతో నింపుతూ ఉంటుంది.

రాజా: మన పరమేశ్వరుడు ఏదో కలలుకంటూ ఉంటాడు.

నారాయణరావు బిచ్చగాళ్లను తలచుకొని మనవారి ధార్మికత సార్వజనీనముగ దేశములోని ధనము పంచుచున్న విధము ఊహించెను. హిందూదేశములో రష్యారాజ్యపద్ధతి యవసరములేదు. అది ప్రాపంచిక సంబంధమైనది. మనదేశ మాత్మోపలబ్ధికై పాటుపడినది. కావున రష్యా పద్ధతి నవలంబింప జాలదు. రెండు రాజ్యములూ ముఖ్యముగా వ్యవసాయ దేశములేయైనను మనుష్యుని యాత్మవికాసమునకు దోడుపడని పద్ధతు లేవియును భారతవర్షమునకు బనికిరావు. ఏ దేశమునకును పనికిరావు. భరతఖండము సర్వప్రపంచమునకును ధారబోయు బోధన మిదియే. జపానుదేశము నిమేషమాత్రమున పాశ్చాత్య మార్గ మవలంబించినది. టర్కీ అనుకరించుచున్నది. పెరిసియా యా మార్గము వెంట నడువనున్నది. కాని నూటయేబది సంవత్సరములనుండి పాశ్చాత్య నాగరికతాసారము మన రక్త నాళములలోనికి ఇంజెక్షను చేయబడుచుండినను, మనలోనున్న పూర్వసంప్రదాయవాసనల నది నశింపజేయలేకున్నది. ‘అయ్యో, నాతల్లీ! నీకీ పాశ్చాత్యనాగరికతా విమోచన మెప్పుడోగదా’ అనుకొనుచు నారాయణరావు నిమీలితలోచనుడైనాడు.

పరమేశ్వరుడు ‘ఏమర్రా! మీరిద్దరూ ఆలోచనలలో పడ్డారు. ఆలం మాట్లాడడు. నాపాటను గురించి మంచీ చెడ్డా చెప్పారుకారు. కష్టపడి తయారు చేశాను. కోకిల్లా పాడాను’ అని మిత్రుల నిరువురిని బ్రశ్నించెను. ఆలం నవ్వుచు ‘నిన్ను మా పారశీకకవి ఒమారు ఖయ్యాముతో పోల్చానురా, పో’ అన్నాడు.

నారాయణరావు ‘కారువాడికి కబురుపంపినాను. వాడు కారుపట్టుకు వస్తాడు. కాస్త కాఫీ పుచ్చుకోండి. రాజారావు సిగరెట్లు కాల్చడు. మనకు త్రీకాజీల్సు ఉన్నాయి. పదండిరా సినీమాకు, డగ్లాసు ఫిలుము ‘త్రీమస్కెటీర్లు’ వచ్చిందిరా పదండి. సుబ్బయ్యా కాఫీపట్టుకురా!’ యని కేక వేసెను.

ఆలం: నాకు పరాటాలు, కోడిగుడ్లు కావాలిరా.

పరం: ఈ కుంకాయికి ఒక జందెం తగిలించరా నారాయుడూ.

ఆలం: మీ కందరికీ ముస్లీముమతం ఇద్దామని చూస్తూంటే!

నారా: తెలుగు తురకలకు, అరవ తురకలకు హిందువులతో దెబ్బలాట లేనేలేదుకాదట్రా! మీ కందరికి హిందూమతం ఇద్దామని మేము చూస్తున్నాం.