పుట:Narayana Rao Novel.djvu/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౭(7)

జగన్మోహనరావు

శ్రీ రాజా క్రొవ్విడి బసవరాజ రాజేశ్వర శ్రీ జగన్మోహనరావు బహద్దరుగారు గంజాంజిల్లాలోని నారికేళివలస జమీందారుగారు. నారికేళివలస బరంపురమునకు గొలదిమైళ్ళదూరములో నున్నది. జమీయంతయు బది గ్రామములు. సాలుకు ముప్పదివేలు రాబడి.

కాని జగన్మోహనరావు బహద్దరుగారు మహోదారపురుషులు. ధనమొకచోట కూడియుండుట వారికి బడదు. ఏరీతినైననేమి ధనము ప్రపంచములోనికి బంపుట లోకకల్యాణప్రదము. భోగకాంతలు, బ్రాందీషాపు యజమానులు, జూదరులైన స్నేహితులు మొదలగువారు ధూమశకటములవంటివారు. ధనమును దేశములో వెదజల్లుటలో వారు ప్రసిద్ధులు. వారి సహాయము లేనిచో, నొకచోటనే పాదుకొని పనికిమాలినదగును. ఇదీ వారి అర్థనీతి. పరదేశముల నుండి వచ్చు చాంపేను బోర్డియా, ఎక్షాబ్రాంది, విస్కీలు సేవించితిమేని మనకు విశ్వసౌందర్యమలవడును. సిగరెట్లు మెదడును శుభ్రపరచి జ్ఞానాభివృద్ధిని జేయును. నాట్యస్త్రీలను బ్రోత్సహించుట లలితకళాభివృద్ధికే.

జమీలలో జమీరైతుల క్షేమము ముఖ్యము అని వారిముందు ఎవరయిన పలికిరేని ఆయన పకాలున నవ్వును. అట్లయినచో ప్రభుత్వమువారేల జమీందారీ పద్ధతి ప్రవేశపెట్టెదరు? రైతు వారీపద్ధతినే యుంచియుందురు. కాబట్టి జమీధనము చిత్తమువచ్చినట్లు జమిందా రుపయోగపరచుకొనవలయును. అప్పులు చేసిన జమీ పాడగుట యేల సంభవించును? జమీలు జమీందారుల పాలినుండి తప్పింపకూడదట! జమీందారులు శాశ్వతబ్రహ్మకల్పముగ జమీల గట్టుకొని యూరేగెదరా? బ్రతికియున్ననాళ్లు ననుభవించవలెను. తరువాత వేరొకనికి బోవుగాక! ఈ సంపద ఎల్లకాలము నొక్కరే యేల అనుభవింపవలెను? జమీ లమ్మకూడదని శాసన మెందుకయ్యా? అని జగన్మోహనరావు వాదించుకొని తన్ను తాను సమాధాన పెట్టుకొనుచుండును. ‘ధనము ననుభవించుట నెఱుగని కాశ్మీరగార్దభములు, అనుభవించు నాబోట్లను భోగలాలసులనియు, విలాస పురుషులనియు నిందింతురు. దూషణ భూషణ తిరస్కారములు దేహమునకు గాని యాత్మకు గావు. నేను బహుసహస్రనారీ పరివేష్టితుడగు గోపాలకృష్ణుడను’ అని యనుకొనుచు జగన్మోహనరావు విశాఖపట్టణములోని తన మేడనుండి దిగి, వీథిలో వేచియున్న కారులోనికి నెక్కెను. వారు వేగముతో నా శకటము సముద్రతీరమున ‘డాల్ఫినుముక్కు’ వైపుననున్న మాక్లిన్ జేమ్సు ఆను నొక యూరేషియను గృహస్థునింటికడ నాగెను.