పుట:Narayana Rao Novel.djvu/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

నారాయణరావు

ముల నొకరి నొకరిట్లు వెదకికొనుచు నేకమగుచున్నామా? ఈ సంయోగ వియోగముల కంతమెక్కడ? చరితార్థత యెక్కడ?

ఆలోచనాధీనుడగు నారాయణరావు భోజనము చేసి, యొంటిమై తాంబూలము వేసికొను శారద నల్లన జేరి, ‘నాకు రెండాకులు రాసియిస్తావా?’ యని యాచించెను. ఆమె యులికిపడి భర్తవంక నొక నిముషముచూచి, మారుమాటాడక యా లేత తమలంపుటాకులు చిలుకలుచుట్ట నారంభించెను. నారాయణ సంతసము మై జిఱునవ్వునవ్వుచు నచ్చటనే వేఱొక యాసనముపై నధివసించెను.

నారాయణరావురూప మానాడు శారద కేలనో సుందరతరమై కన్పించినది. వివిధవర్ణ విద్యుద్దీపికల ప్రసన్నకాంతిలో నాతనిరూపము మఱింత మోహనమై కాన్పించినది. అవ్యక్తమధురములగు నూతనానుభవము లామెలో జాగరితములుగానోపు లజ్జచే నామె కపోలము లించుక చెమర్చినవి. ఆమె పెదవులలో జ్యోత్స్నలు నాట్యమాడినవి. తల వంచియే దీర్ఘములగు కంటిరెప్పల నెత్తి యా బాలిక భర్తను మరల గనుగొన్నది. తెల్లని పొందూరుపట్టు శాలీ ఖదరులాల్చీలోనుండి ముడులువడు నాతని దేహసుభగత్వము వెలిగిపోవుచున్నది. ఉబికి విస్తరించియున్న యాతని మెడకండరములు తొనలవలె తిరిగియున్నవి. గంభీరమగు నాతని ముఖము, విశాల ఫాలము, తీరైన ముక్కు, చెవులు నాతనికి దేవసేనానియగు కుమారస్వామి సౌందర్యమును ప్రసాదించినవి. శారదాదేవి స్తోకవక్షము లుప్పొంగినవి. విభ్రమవతియైనది. సానురాగయై భర్త చేతిలో సుగంధ ద్రవ్యములు గూర్చిన వక్కపొడియు, దమలపాకు చిల్కలు పెట్టుచు స్పర్శసుఖ మనుభవించినది. ఆ వ్రీడావతి శరీరము పుల్కరించినది. ‘హాయి’ యనుచు నామె హృదయ మానందపూరితమైనది.

నారాయణరావు మృదులమ్పదులమగు నా కరతలము గ్రహించి, ‘నీ చేతి రేఖలు చూడవలె‘నని యామెపాణి చూడ నారంభించెను. మెత్తని గులాబి మొగ్గవలెనున్న యామె చేతిలో రేఖలు స్పష్టములై యున్నవి. దీర్ఘములై లలితములగు నా వేళ్ళు తీగెలే. గోళ్ళు ఎరుపులై సంధ్యారాగ తప్తములగు నక్షత్రములవలె ప్రకాశించినవి. నీలము పొదివిన తన చిటికనవ్రేలి యుంగరము తీసి యాత డామె యనామికకు దోడిగి ‘ఎంతవదులో!’ యనుచు చిరునవ్వు నవ్వెను. ఆమె వజ్రపుటుంగరము తన కనిష్టికాంగుళికి దొడిగి ‘జూచితివా, బిగు’వని మేలమాడుచు, దీపికాకాంతిలో నద్దాని గాంచుచు నిది నా ప్రాణప్రదమని ముద్దాడుకొనినాడు. ‘చెన్నపట్టణము నుండి చక్కని యుంగర మొకటి తెచ్చి, యా చిట్టివ్రేలికి దొడిగికొందు’నని ప్రేమపూర్వకముగా ననుజ్ఞ వేడికొన్నాడు.

శారద నెమ్మదిగా జేయి లాగికొన్నది. ఆమె గుండియలు దడ దడ కొట్టుకొన్నవి. ‘ఇంత మెత్తని వేళ్ళకు వీణతీగెల నొక్కులు బాధకాదూ శారదా?’ యని నారాయణరావు ప్రశ్నించెను.